NTR Kathanayakudu: Unjustified Castings

యన్.టి.ఆర్ కథానాయకుడు: సరితూగని తారలు
ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటించిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’లో కొన్ని పాత్రలకు ఎంచుకొన్న తారలు వాటికి సరిపోలేదని చెప్పాలి. మిగతావాటిని అలా ఉంచితే ఎన్టీఆర్‌తో సినిమాల్లో జోడీ కట్టిన తారలకు ఎంచుకున్న పాత్రధారుల్లో ఇద్దరు మాత్రమే వాటికి న్యాయం చేశారని చెప్పాలి.
ఒకరు సావిత్రిగా చేసిన నిత్యా మీనన్, మరొకరు ప్రభగా కనిపించిన శ్రియ. సావిత్రి పాత్ర మనకు రెండు సీన్లలో కనిపిస్తుంది. ఒకటి – ఏఎన్నార్‌తో మద్రాస్‌లోని ఆయన ఇంటిని తాను కొంటానంటూ బ్లాంక్ చెక్ ఇవ్వడం, రెండు – ‘గుండమ్మ కథ’ సినిమాలో ఎన్టీఆర్‌తో ‘లేచింది నిద్ర లేచింది మహిళా లోకం’ పాట సీక్వెన్స్‌లో. ఈ రెండింటిలో నిత్య అభినయం సావిత్రిని మరిపించింది.
అలాగే ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో దుర్యోధనుడు, ఆయన భార్య భానుమతి మీద చిత్రించిన ‘చిత్రం భళారే విచిత్రం’ పాటలో ప్రభ పాత్రలో శ్రియ కనిపిస్తారు. చక్కని డాన్సర్ అయిన శ్రియ హావభావాలతో నర్తించి ప్రభ పాత్రకు సరితూగారు. ఆ ఇద్దరు మినహాయిస్తే మిగతా వారెవ్వరూ ఆ పాత్రలకు సూట్ కాలేదు.
షావుకారు జానకి పాత్రలో శాలినీ పాండే, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్, కృష్ణకుమారిగా ప్రణీత, జయప్రదగా హన్సిక ఏమాత్రం నప్పలేదు. శ్రీదేవి పాత్రకు రెండు సీన్లున్నాయి. ఒకటి – ‘వేటగాడు’లోని ‘ఆకుచాటు పిందె తడిసె’ పాట సీక్వెన్స్, ఇంకొకటి – ‘బొబ్బిలిపులి’లోని కోర్టు సన్నివేశం. శ్రీదేవిగా రకుల్‌ప్రీత్ నప్పలేదు.
‘యమగోల’లో ‘ఓలమ్మీ తిక్క రేగిందా’ పాటలో జయప్రదలా హన్సికను ఎంతగా ఊహించుకుందామన్నా మనవల్ల కాదు. షావుకారు జానకి ఎక్కడ? శాలినీ పాండే ఎక్కడ? బక్కపలచని శాలినికి, బొద్దుగా ఉండే జానకికి ఏమాత్రం పోలిక ఉందా? జానకి హావభావాలను శాలిని నుంచి ఆశించగలమా?
తన కాలంలో కళ్లతోనే భావాలు పలికించే అద్భుత సౌందర్యరాశిగా పేరు తెచ్చుకొన్న కృష్ణకుమారి ఎక్కడ? ప్రణీత ఎక్కడ? ఆమె పాత్రలో ఈమెను ఏ రకంగానూ ఊహించలేం. కేస్టింగ్ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తే బాగుండేదని వీళ్లను చూస్తే అర్థమవుతుంది. అయితే సమయం తక్కువ ఉండటం వల్లే కేస్టింగ్ విషయంలో రాజీ పడ్డారని అనిపించక మానదు.