Rama Is 3 Times Bigger Than Kala Bhairava


Rama Is 3 Times Bigger Than Kala Bhairava

‘మగధీర’ కంటే ‘వినయ విధేయ రామ’ మూడు రెట్లు ఎక్కువ!

రాంచరణ్ కథానాయకుడిగా యస్.యస్. రాజమౌళి రూపొందించిన ‘మగధీర’ సంచలన విజయం సాధించింది. అప్పటివరకు బాక్సాఫీస్ వద్ద ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును తిరగరాసింది. పునర్జన్మ ఇతివృత్తంతో విజయేంద్రప్రసాద్ రాసిన కథను తనదైన పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో రాజమౌళి ఆ సినిమాను తీర్చిదిద్దాడు. అందులో పూర్వజన్మలో కాలభైరవ అనే ఒక వీర సైనికుడి పాత్రలో రాంచరణ్ కనిపించాడు.

ఒక యుద్ధ సన్నివేశంలో ఆ రాజ్యంపైకి దండెత్తి వచ్చిన షేర్‌ఖాన్ అనే యోధుడి సైన్యంతో పోటీపడతాడు. ఒక్కడే వందమంది యోధుల్ని చంపి, తానూ చనిపోతాడు. అంతటి యోధుడైన కాలభైరవ కంటే శక్తిమంతుడిని బోయపాటి శ్రీను సృష్టించాడు. ఆ పాత్ర పేరు రామ. ‘వినయ విధేయ రామ’లోని హీరో పాత్ర పేరు అది. ఇందులో రామ చూడ్డానికి మానవ మాత్రుడే కానీ అతడి వీరత్వం, అతడి ధైర్యం మానవాతీతం.

‘మగధీర’లో కాలభైరవ లాంటి మహావీరుడే షేర్‌ఖాన్ సైన్యంలోని వందమంది వీరుల్ని చంపితే, ఇందులో రామ బిహార్‌లోని రాజాభాయ్ మున్నా (వివేక్ ఓబరాయ్) గ్యాంగ్‌లోని కిరాతకుల్లో మూడొందల మందిని సునాయాసంగా లేపేసి, ఇంకా చాల్లేదని, మరింతమందిని లెక్కపెట్టే ప్రయత్నంలో ఉంటాడు. “దారి తెలుసుకోడానికి వందమందిని, దారికి అడ్డొచ్చిన వాళ్లని వందమందిని, దారిలో ఇంకో వందమందిని.. మొత్తం ముప్పై మందిని చంపాను. అయినా చాల్లేదు. సరైన ఒక్క మగాడూ తగల్లేదు” అంటాడు.

చంపేప్పుడు కూడా ఎంతమందిని చంపుతున్నాడనే లెక్కలు కూడా వేసుకున్నాడన్న మాట రామ. ఏదేమైనా ‘మగధీర’లోని కాలభైరవ చంపిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ మందిని రామ చంపాడు కాబట్టి అతగాడి కంటే ఇతడు మూడు రెట్లు ఎక్కువ శక్తిమంతుడు కింద లెక్క. పైగా అక్కడ కాలభైరవ చనిపోతాడు. ఇక్కడ రామ ఇంకా ఎంత మంది వచ్చినా నరికేయడానికి సిద్ధంగా ఉంటాడు. మరి ఆ లెక్కన బాక్సాఫీస్ వద్ద కూడా ఆ ‘మగధీర’ కంటే ఈ ‘వినయ విధేయ రామ’ మూడు రెట్లు ఎక్కువ వసూళ్లను సాధిస్తాడా! ఏదేమైనా రెండు పాత్రల్నీ పోషించే భాగ్యం రాంచరణ్‌కే దక్కింది.