Suryakantham: 5 Reveals From The Teaser


Suryakantham: 5 Reveals From The Teaser

సూర్యకాంతం: టీజర్ తెలియజేస్తున్న5 విషయాలు

నీహారిక టైటిల్ రోల్ చేస్తున్న ‘సూర్యకాంతం’ టీజర్‌కు చాలామంది సెలబ్రిటీల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. లహరి మ్యూజిక్ యూట్యూబ్‌లో జనవరి 25న విడుదల చేసిన టీజర్‌కు ఇప్పటివరకు సుమారు 15 లక్షల వ్యూస్ వచ్చాయి. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. కాగా ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్.. కథకు సంబంధించిన కొన్ని విషయాల్ని తెలియజేస్తోంది.

ఫోన్’లో హీరోకు “మామూలు అమ్మాయిలే అబ్బాయిల్ని ఫుట్‌బాల్ ఆడుకుంటారు. నువ్వు ఏకంగా డైరెక్ట్‌గా ఫుట్‌బాల్ ప్లేయర్‌తోనే పెట్టుకున్నావ్” అని సత్య చెప్పడాన్ని బట్టి ఇందులో నీహారిక ఫుట్‌బాల్ ప్లేయర్ అని తెలుస్తోంది. అయితే టీజర్‌లో ఆమె ఫుట్‌బాల్ ఆడుతున్న సీన్ ఏదీ చూపించలేదు. సత్య డైలాగ్‌తో ఆమె ఏమిటన్నది తెలిపారు. సినిమాలో హోలీ పండుగ నేపథ్యంలో సన్నివేశాలు కానీ, ఒక పాట కానీ ఉందని హీరో అభి చాలా ఆనందంగా హోలీ ఆడే సీన్ వల్ల అర్థం చేసుకోవచ్చు.

Suryakantham: 5 Reveals From The Teaser

హీరో పేరడిగితే “తెలుసుకొని ఏం చేస్తావ్.. రేప్పొద్దున నీకు పుట్టబోయే పిల్లలకు పెట్టుకుంటావా?” అంటుంది హీరోయిన్. “సరే.. నీ గురించి చెప్పు?” అనడుగుతుంది. “నా పేరు అభి..” అని అతడింకా చెప్పబోతుంటే, “చాల్లే.. అంతకన్నా తెలుసుకొని నేనేంజేస్తా” అంటుంది మన సూర్యకాంతం. దాన్ని బట్టి ఆమె యాటిట్యూడ్ ఉన్న అమ్మాయని ఊహించుకోవచ్చు. అంతే కాదు రెండు సందర్భాల్లో సత్యను లాగి గట్టిగా చెంప మీద కొట్టడం చూస్తుంటే సూర్యకాంతంలా గట్టిగా అరవడమే కాదు, తేడా వస్తే ఎదుటివాళ్లను చితక్కొట్టడానికి వెనుకాడని అగ్గిబరాటా అని కూడా తెలుస్తోంది.

చేతిపై చాకు పెట్టుకొని “నేను ఐదు లెక్కపెట్టేలోపు నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే నిజంగానే కోసుకుంటాను” అంటుంది అమ్మ (సుహాసిని). ఏమాత్రం భయం కానీ, ఆందోళన కానీ లేకుండా క్యూరియాసిటీతో తనే “ఒన్.. టు.. త్రీ.. ఫోర్.. ఫైవ్” అంటూ లెక్కపెడుతుంది సూర్యకాంతం. అంటే కూతురికి పెళ్లి చేసి పంపెయ్యాలని అమ్మ చూస్తుంటే కూతురు పడనివ్వడం లేదు. చెయ్యి కోసుకుంటానని అమ్మ బెదిరించినా భయపడకుండా నవ్వు ముఖంతో ఒంట్లు లెక్కపెట్టడం చూస్తుంటే అమ్మ ఆ పని చెయ్యదనే నమ్మకమైనా అయ్యిండాలి, లేదంటే నన్ను పెళ్లికి ఒప్పించడం నీ వల్ల కాదులే అనే ధీమా అయినా అయ్యుండాలి. మొత్తానికి సూర్యకాంతం మామూలు అమ్మాయి కాదు, నిఖార్సయిన నేటి కాలపు అమ్మాయని అర్థమవుతోంది.

Suryakantham: 5 Reveals From The Teaser

సూర్యకాంతం లాంటి అలాంటి అమ్మాయిని అభి ప్రేమించాడు. పార్కులో అతడితో ఆమె ఆనందంగా ఆడుతుండటం చూస్తుంటే అంతటి అమ్మాయి కూడా ప్రేమలో పడినట్లే అనిపిస్తోంది. ఆ విషయం అర్థమయ్యాక తను ఆశ్చర్యపోతుందనీ, ఆ విషయం గురించి ఆలోచిస్తుందనీ టీజర్ ద్వారా తెలుస్తోంది. చూడాలి.. టీజర్ చెప్తున్న ఈ విషయాలు సినిమాలో ఎలా ఉంటాయో!