Tarun: From Hero To Zero!


Tarun: From Hero To Zero!
Tarun: From Hero To Zero!

తరుణ్: హీరో నుంచి జీరో దాకా..!

తెలుగు నటులెవ్వరికీ అంతవరకు దక్కని గౌరవం దక్కించుకున్న నటుడిగా అతడు పేరు తెచ్చుకున్నాడు. తొలి చిత్రం ‘అంజలి’తో ఉత్తమ బాలనటుడిగా ఏకంగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇక హీరోగా అతడు చేసిన తొలి చిత్రం ‘నువ్వే కావాలి’ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇలాంటి అపురూప నేపథ్యం ఉన్న నటుడు.. తరుణ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘నువ్వే కావాలి’ సినిమా రాత్రికి రాత్రే అతడ్ని క్రేజీ హీరోగా మార్చేసింది. చాలా స్వల్ప బడ్జెట్‌తో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా అసాధారణ వసూళ్లు సాధించి యూత్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

అయినా ఆ సినిమా ఇచ్చిన ఇమేజ్‌ను కంటిన్యూ చేయడంలో తప్పటడుగులు వేశాడు తరుణ్. లేదంటే ఇప్పటి చేతిలో సినిమాలు లేని స్థితిలో ఉండేవాడు కాదు. మొదట్లో కెరీర్ ఒక హిట్టు, ఒక ఫ్లాపుగా ఉన్నా తర్వాత వరుస ఫ్లాపులతో ఇమేజ్‌నీ, ఫలితంగా మార్కెట్‌నీ కోల్పోయాడు. ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’ హిట్ల వరకు అతడి పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత వరుసగా ఆరు ఫ్లాపులు. 2007లో వచ్చిన ‘నవ వసంతం’ ఫర్వాలేదనిపించింది. తర్వాత ఇలియానాతో ‘భలే దొంగలు’, జెనీలియాతో ‘శశిరేఖా పరిణయం’ వంటి హై ప్రొఫైల్ సినిమాలు చేశాడు. ఆ రెండూ కాస్ట్ ఫెయిల్యూర్స్ అయ్యాయి.

చిత్రమేమంటే ఆ తర్వాత నాలుగేళ్ల పాటు అతడు సినిమాలు చేయకపోవడం. 2013లో ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’తో మళ్లీ కనిపించాడు. ఫలితం డిటో. 2014లో ‘యుద్ధం’, ‘వేట’ సినిమాలతో అతడి కెరీర్ పూర్తిగా కిందికి పడిపోయింది. మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని 2018లో ‘ఇది నా లవ్ స్టోరీ’ అంటూ పలకరించాడు కానీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. స్ఫురద్రూపం, నటనలో ఈజ్, చక్కని డైలాగ్ డిక్షన్.. ఇన్ని ప్లస్ పాయింట్లున్నా అతడు హీరోగా ముందుకు వెళ్లకపోవడం స్వయంకృతాపరాధమే.