Vaishnav Tej’s Debut Movie Launched


Vaishnav Tej's Debut Movie Launched

చిరంజీవి క్లాప్‌తో ప్రారంభమైన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న పేరుపెట్టని చిత్రం షూటింగ్ నేడు (జనవరి 21) రామానాయుడు స్టూడియోస్ (నానక్‌రామగూడ)లో ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. సాయిధరమ్, వైష్ణవ్ తేజ్ తల్లిదండ్రులు శివప్రసాద్, విజయ దుర్గ, చిరంజీవి తల్లి అంజనాదేవి, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కూడా పాల్గొన్నారు. తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు. నాగబాబు , అల్లు అర్జున్ స్క్రిప్ట్ ని దర్శకుడికి అందజేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “ఇంతచక్కటి అవకాశం ప్రారంభంలోనే వైష్ణవ్ తేజ్‌కు లభించడం అదృష్టం. ఇలాంటి నిర్మాతల అండదండలతో, వారు ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. డైరెక్టర్ బుచ్చిబాబు చాలా కొత్త కథ రాశాడు.. చాల ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ కథను నాకు నేరేట్ చేసినప్పుడు రస్టిక్ ఎలిమెంట్స్ కనిపించాయి. రస్టిక్ అనగానే ‘రంగస్థలం’ గుర్తుకువస్తుంది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. బుచ్చిబాబు మనసు పెట్టి రాసిన కథ. అతని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. పెద్ద మనసున్న డైరెక్టర్ సుకుమార్. తాను మాత్రమే ఎదగాలని కాకుండా తనతో పాటు ఇతరులు ఎదగాలని సుకుమార్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Vaishnav Tej's Debut Movie Launched

సుకుమార్ మాట్లాడుతూ “మైత్రి మూవీస్ తో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా శిష్యుడు ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. అద్భుతమైన కథ రాశాడు. ఒక్క సిట్టింగ్ లోనే ఒకే చేసిన కథ ఇది. బుచ్చిబాబు గొప్ప డైరెక్టర్ అవుతాడని కచ్చితంగా చెప్పగలను. వైష్ణవ్ కోసమే ఈ కథ పుట్టింది. కథ రాస్తున్నప్పుడే వైష్ణవ్ అని ఫిక్స్ అయ్యాడు. వేరే ఆప్షన్స్ చూడమన్నా వైష్ణవ్ ఈ సినిమాకి న్యాయం చేయగలడు అని ఒప్పించాడు. ఈ ప్రాజెక్ట్ ఇంతదూరం రావడానికి కారణం ఈ సినిమా కథే. కొత్తమ్మాయి మనీషా తెలుగమ్మాయి. చాలా మందిని టెస్ట్ చేసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న దేవిశ్రీప్రసాద్ కి చాలా థాంక్స్. ఈ సినిమా ఆల్బం ఓ రేంజ్ లో ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. వైష్ణవ్ కి మంచి ఫ్యూచర్ ఉంది” అని చెప్పారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ “బుచ్చిబాబు గారితో నాకు చాలా రోజుల నుంచి పరిచయం. సుకుమార్ గారితో చేస్తున్నప్పటి నుంచి అయన తెలుసు. సుకుమార్ గారిని ఓ కథతో ఒప్పించడమే బుచ్చిబాబు ఆస్కార్ కొట్టినంత పనిచేశాడు. ఈ సినిమా నేను చేయడానికి కారణం సుకుమార్ గారే. బుచ్చిబాబు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పకుండా చేయాలనిపించింది. తప్పకుండా ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇస్తాను. మెగా హీరోస్ అందరికి మ్యూజిక్ ఇచ్చాను. చాలా థ్రిల్లింగ్ గా ఉంది” అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ “ఎవరైనా దేవుడి ముందు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు కానీ నేను మాత్రం దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఇవ్వండి సినిమా నిలబెడతాడు అని కోరుకుంటాను. వైష్ణవ్ గారు ఈ సినిమా కి యాప్ట్ హీరో. సినిమా చాల బాగుంటుంది. కొత్తగా ఉంటుంది” అన్నారు.

ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి, సినిమాటోగ్రఫీ: శ్యాందత్, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ మౌనికా, ఎడిటర్: నవీన్ నూలి.