Vishal Rubbishes Marriage Rumours


Vishal Rubbishes Marriage Rumours

పెళ్లి వదంతుల్ని ఖండించిన విశాల్

తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్న తెలుగు యువకుడు విశాల్ తన పెళ్లిపై కొంత కాలంగా వస్తున్న వార్తల్నీ, ప్రచారాన్నీ ఖండించారు. శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మిని ఆయన వివాహమాడనున్నట్లు చాలా కాలంగా వదంతులు వస్తూనే ఉన్నాయి. తాము మంచి స్నేహితులమే కానీ, ప్రేమికులం కామనీ, తమకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదనీ ఇద్దరూ ప్రకటించినా ప్రచారం ఆగలేదు. అలాగే ఇటీవల విశాల్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు ఇంటర్నెట్‌లో వదంతులు పుట్టాయి.

ఈ ప్రచారంపై విశాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నా పెళ్లి గురించి కొన్ని వ్యాసాల్లో తప్పుడు తప్పుడు వార్తల్నీ, తప్పుడు వివరాల్నీ ఎలా రాశారో చూస్తుంటే విస్మయం కలుగుతోంది. దయచేసి సరిచేసుకోండి. అది సరైన పని కాదు. ఇది నా వ్యక్తిగత జీవితం. త్వరలోనే నా పెళ్లి గురించిన అన్ని వివరాలు సంతోషంగా తెలియజేస్తాను. గాడ్ బ్లెస్” అని చెప్పుకొచ్చారు. ఆయన విజ్ఞప్తి తర్వాతైనా ఈ ప్రచారానికి తెర పడుతుందేమో చూడాలి.