‘118’తో మూడో హిట్ ఖాయమేనా?


'118'తో మూడో హిట్ ఖాయమేనా?

నందమూరి కల్యాణ్‌రామ్ కెరీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. “15 సినిమాలు.. 2 హిట్లు!” అని చెప్పొచ్చు. అంటే విజయ శాతం కేవలం 13. ఒక హీరో ఇలాంటి నేపథ్యంతో సినీ రంగంలో కొనసాగడం అంటే ఆషామాషీ విషయం కాదు. పట్టు వదలని విక్రమార్కుడు లాంటివాళ్లే ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఎన్ని అడ్డంకులు, అపజయాలు ఎదురైనా ముందుకు వెళ్తుంటారు. కల్యాణ్‌రాంను అలాంటి కోవకు చెందిన నటుడిగా చెప్పుకోవచ్చు.

2003లో రామోజీరావు నిర్మించిన ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరోగా పరిచయమైన కల్యాణ్‌రామ్ కు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. రెండో సినిమా ‘అభిమన్యు’ ఫలితం కూడా అంతే. లాభం లేదనుకొని తనే నిర్మాతగా మారి యన్.టి.ఆర్. ఆర్ట్స్ బేనర్ స్థాపించాడు. క్రాంతికుమార్ శిష్యుడు సురేందర్‌రెడ్డిని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ‘అతనొక్కడే’ చేశాడు. తొలి సక్సెస్ రుచిని చవిచూశాడు.

కానీ తర్వాత కథ మళ్లీ మొదటికి వచ్చింది. వరుసగా 7 సినిమాల్లో ఏ ఒక్కటీ ఆశాజనకంగా ఆడలేదు. ‘లక్ష్మీ కల్యాణం’, ‘హరే రామ్’ సినిమాలు యావరేజ్ అనిపించుకోగా, ‘అసాధ్యుడు’, ‘విజయదశమి’, ‘జయీభవ’, ‘కల్యాణ్‌రామ్ కత్తి’, ‘ఓం 3డి’ సినిమాలు ఫ్లాపయ్యాయి.

‘అతనొక్కడే’ (2005) తర్వాత పదేళ్లకు కానీ అతడికి మళ్లీ హిట్ దక్కలేదు. అనిల్ రావిపూడిని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ సొంత బేనర్‌పై అతడు చేసిన ‘పటాస్’ అతడి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా, అందరికీ మంచి లాభాలు ఆర్జించి పెట్టిన సినిమాగా నిలిచింది.

దాని తర్వాత నాలుగు సినిమాలు చేశాడు కల్యాణ్‌రామ్. వాటిలో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో చేసిన ‘ఇజం’, ‘ఎం.ఎల్.ఎ.’ సినిమాలు ఓ మోస్తరుగా ఆడితే, ‘షేర్’, ‘నా నువ్వే’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్‌ను టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ‘118’ సినిమా చేశాడు. టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమేపీ పెరుగుతూ వచ్చింది. కల్యాణ్‌రామ్ సినిమా గురించి ఈ స్థాయి ఆసక్తి వ్యక్తం కావడం ఇటీవలి కాలంలో చూడలేదు.

యాక్షన్ థ్రిల్లర్‌గా పరిగణిస్తూ వచ్చిన ఈ సినిమాలో నివేదా థామస్, షాలినీ పాండే లాంటి ఇద్దరు ప్రతిభావంతులైన తారలు నటించడం సినిమాకి గ్లామర్‌తో పాటు, వెయిట్‌నూ తెచ్చింది. కథ నివేదా కేరక్టర్ చుట్టూ తిరుగుతుందని కల్యాణ్‌రామ్ చెప్పగా, ఒక సీన్‌లో ఆమె నటనకు తన ప్రమేయం లేకుండానే కళ్లల్లోంచి నీళ్లొచ్చాయని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.

దీనితో సినిమాలో ‘విషయం’ ఉందనే అభిప్రాయం వ్యాపించింది. కచ్చితంగా ఈ సినిమాతో కల్యాణ్‌రామ్ హిట్ కొడతాడనే నమ్మకమూ కలుగుతోంది. శుక్రవారమే (మార్చి 1) ఈ సినిమా మన ముందుకు వస్తోంది. ‘118’లో చిక్కుకున్న కల్యాణ్‌రామ్ తనకు ఎదురైన విపత్కర పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొని విజయం సాధిస్తాడో చూద్దాం.

– సజ్జా వరుణ్