4 Big Movies That F2 Destroyed At The Box Office


4 Big Movies That F2 Destroyed At The Box Office
Varun Tej and Venkatesh in F2

4 పెద్ద సినిమాల్ని మట్టి కరిపించిన ‘ఎఫ్2’

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్2’ విడుదలైన వారాంతం తర్వాత ట్రేడ్ విశ్లేషకులు ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా రూ. 50 కోట్ల షేర్ సాధించవచ్చని అంచనా వేశారు. ఆ వసూళ్లకే అది పెద్ద హిట్టయినట్లు లెక్క. కానీ 25 రోజుల గడిచిన తర్వాత ఆ సినిమా వసూళ్లు ఏకంగా రూ. 77 కోట్ల షేర్ దాటాయి. ఇది అనూహ్యం.

ఈ వసూళ్లతో ‘ఎఫ్2’ సినిమా టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో 8వ స్థానం సంపాదించింది. భారీ సినిమాలతో పోలిస్తే ఒక మాదిరి బడ్జెట్‌తో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మించిన ఈ కామిక్ ఫిల్మ్ ఇలాంటి వసూళ్లు సాధించడం చూసి ట్రేడ్ పండితులే నోళ్లు వెళ్లబెట్టారు.

విడుదలకు ముందు దీని బిజినెస్ విలువ రూ. 28 కోట్లు వసూలైతే గొప్పే అనుకుంటే, ఏకంగా పెట్టుబడిపై 175 శాతం లాభాలు రావడం ఎవరికైనా నమ్మశక్యంగా ఉంటుందా! ఆ రకంగా 2019 ఆరంభంలోనే దిల్ రాజు పంట పండింది.

గత ఏడాది ‘గీత గోవిందం’, ఇప్పుడు ‘ఎఫ్2’ సాధించిన మహా గొప్ప విజయాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.. ఆహ్లాదకరమైన ఫ్యామిలీ స్టోరీలను అక్కున చేర్చుకొనేందుకు తెలుగు ప్రేక్షకులు ఆవురావురుమంటున్నారు అని.

‘ఎఫ్2’ దెబ్బకు బాక్సాఫీస్ వద్ద 4 పెద్ద, క్రేజీ సినిమాలు దెబ్బతినిపోయాయి. అవి – ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘పేట’, ‘వినయ విధేయ రామ’, ‘మిస్టర్ మజ్ను’.

బాలకృష్ణ టైటిల్ రోల్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్‌లోని తొలి భాగం ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ ఘోరాతి ఘోరంగా పరాజయం పాలయింది. దాని ప్రి బిజినెస్ విలువ రూ. 55 కోట్లయితే, ప్రపంచవ్యాప్తంగా వసూలైంది కేవలం రూ. 20.6 కోట్లు మాత్రమే. ఫిబ్రవరి 7న రెండో భాగం ‘మహానాయకుడు’ను విడుదల చేస్తామని ప్రకటించిన నిర్మాట్లు ఆ తేదీ దాటిపోయినా, దాని విడుదలపై ఇంత దాకా నోరు మెదపకపోవడం గమనార్హం.

రజనీకాంత్ సినిమాలకు తెలుగు టాప్ హీరోల సినిమాల స్థాయి ఆదరణ ఉంది. ఆ ఉద్దేశంతోనే ‘పేట’ను ఎంతో ధైర్యంగా మూడు పెద్ద సినిమాలు బరిలో ఉన్నా సంక్రాంతికి విడుదల చేశారు. రూ. 10 కోట్ల విలువ చేసిన ఈ సినిమా కేవలం రూ. 6 కోట్లే రాబట్టగలిగింది. తొలి వారం కంటే రెండో వారం థియేటర్లు పెంచినా ఉపయోగం కలగలేదు.

రాంచరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘వినయ విధేయ రామ’ బయ్యర్లకు కన్నీళ్లను తెప్పించింది. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రి బిజినెస్ విలువ రూ. 92 కోట్లైతే, వచ్చింది రూ. 62 కోట్లే. ఏకంగా రూ. 30 కోట్ల నష్టాలు. దీని బాక్సాఫీస్ రిజల్ట్ దర్శకుడు బోయపాటి, నిర్మాత దానయ్యకూ మధ్య గొడవకు సైతం కారణమవడం చూస్తున్నాం.

తొలి రెండు సినిమాలు ‘అఖిల్’, ‘హలో’ సరిగా ఆడకపోవడంతో ‘మిస్టర్ మజ్ను’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి కాకుండా రెండు వారాలు ఆలస్యంగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి మూడు రోజులు ఫర్వాలేదనిపించిన వసూళ్లు నాలుగో రోజు నుంచి కిందికి దిగిపోతూ వచ్చాయి.

రెండో వారంలో పలు థియేటర్లను తిరిగి ‘ఎఫ్2’ ఆక్రమించడం గమనార్హం. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రి బిజినెస్ విలువ రూ. 22 కోట్లయితే, తొలి వారం వసూలైంది రూ. 10.45 కోట్లు మాత్రమే. ఫలితంగా మూడోసారీ అఖిల్ దెబ్బతినేశాడు.

ఇలా నాలుగు పెద్ద సినిమాల్ని మట్టి కరిపించి ‘ఎఫ్2’ సినిమా ఇప్పటికీ థియేటర్లలో తన హవాని ఇంకా కొనసాగిస్తూనే ఉంది.

4 Big Movies That F2 Destroyed At The Box Office
Varun Tej and Venkatesh in F2

F2 Review: 4 Ups And 4 Downs