Adivi Sesh And Yarlagadda Supriya To Tie The Knot?


Adivi Sesh And Yarlagadda Supriya To Tie The Knot?
Adivi Sesh and Supriya

అడివి శేష్, సుప్రియ పెళ్లి?

‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాల కథానాయకుడు అడివి శేష్, అక్కినేని నాగార్జున మేనకోడలు, సుమంత్ సోదరి యార్లగడ్డ సుప్రియ పెళ్లి చేసుకోబోతున్నారా? ఇప్పుడు ఇంటర్నెట్‌లో జోరుగా ప్రచారమవుతున్న వార్త ఇదే. ఇదివరకు “ఈ నెలాఖరులో మీ కోసం ఒక పెద్ద ప్రకటన చెయ్యబోతున్నా” అని ట్వీట్ చేశాడు శేష్.

అది కెరీర్‌కు సంబంధించిన ఒక పెద్ద వార్త అయి ఉంటుందని కొంతమందీ, పెళ్లికి సంబంధించింది అయి ఉంటుందనీ ఇంకొంత మందీ భావించారు. అయితే అతడింకా ఏ ప్రకటనా చెయ్యక ముందే సుప్రియను అతడు పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం గుప్పుమంది.

చాలా మంది ఈ ప్రచారానికి ఆశ్చర్యపోయారు. “ఇది నిజమేనా?” అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇప్పటికే రెండు కుటుంబాల వాళ్లూ వాళ్ల పెళ్లికి సరేనన్నారని కూడా వినిపిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన అంశమేమంటే, ఆ ఇద్దరి అనుబంధానికి సంధానకర్తగా సమంత వ్యవహరించిందనే ప్రచారం రావడం.

శేష్ టైటిల్ రోల్ చేయగా ఘన విజయం సాధించిన ‘గూఢచారి’లో సుప్రియ ఒక కీలక పాత్ర చేశారు. హీరోయిన్‌గా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా చేశాక సుప్రియ మళ్లీ తెరపై కనిపించింది ఈ సినిమాలోనే. ఇప్పటివరకూ ఆమె అన్నపూర్ణా స్టూడియోస్ బేనర్‌పై నిర్మించే సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ మేనమామ నాగార్జున తరపు పనులను చక్కబెడుతూ వస్తున్నారు.

ఆమెకు ఇదివరకే ఒకసారి వివాహమైంది. నటుడు చరణ్‌రెడ్డిని ఆమె వివాహమాడారు. తర్వాత పొరపొచ్చాలు రావడంతో విడిపోయారు. సుమారు ఏడేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై చరణ్ మృతి చెందారు.