అడివి శేష్‌తో ‘మేజర్’ని తీస్తున్న మహేశ్!


అడివి శేష్‌తో 'మేజర్'ని తీస్తున్న మహేశ్!

2008 నవంబర్ ముంబై దాడుల ఘటనలో హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్

నెలాఖరుకు ఒక ముఖ్యమైన వార్త చెబుతానన్న అడివి శేష్, మాట నిలబెట్టుకున్నాడు. ‘మేజర్’ అనే సినిమాను చేస్తున్నాననీ, దాన్ని సూపర్‌స్టార్ మహేశ్ నిర్మిస్తున్నాడనీ వెల్లడించాడు.

2008 ముంబైలోని తాజ్‌మహల్ హోటల్‌పై దాడి జరిపిన ఉగ్రవాదులతో ఆఖరి నిమిషం వారికి పోరాడి పలువురిని కాపాడి, తాను అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నాడు. శేష్. దానికి సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా రివీల్ చేశాడు. ఆరు కారణాల వల్ల ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని తెలిపాడు.

ఒక నేషనల్ హీరో కథను తెలుగు, హిందీ భాషల్లో చెయ్యడం, తన ప్రియ మిత్రులైన ‘ఏ ప్లస్ ఎస్ మూవీస్’ ఈ సినిమాని నిర్మించడం, ‘గూఢచారి’ డైరెక్టర్ శశికిరణ్ తిక్కతో మరోసారి పనిచేస్తుండటం, నవంబర్ 26 (2008) ఘటనలో రియల్ హీరో అయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుండటం, సూపర్‌స్టార్ మహేశ్ ఈ సినిమాని నిర్మిస్తుండటం, తమని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తుండటం.. ఆ అరు కారణాలుగా వెల్లడించాడు శేష్.

మహేశ్ సైతం “మన నేషనల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథను అందిస్తుండటం గౌరవంగా భావిస్తున్నా” అంటూ శేష్‌కూ, సహ నిర్మాతలకూ, దర్శకుడికీ, యూనిట్ మొత్తానికీ  తన ట్విట్టర్ పేజీ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు.

హిందీలో ‘ప్యాడ్‌మ్యాన్’, ‘102 నాటౌట్’, మలయాళంలో ‘9’ సినిమాలని నిర్మించిన సోనీ పిక్చర్స్ ఇండియా, ‘మేజర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.

2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

అడివి శేష్‌తో 'మేజర్'ని తీస్తున్న మహేశ్!
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్