‘మేజర్’తో మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచిన శేష్!


'మేజర్'తో మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచిన శేష్!
అడివి శేష్

ప్రేక్షకుల్నీ, చిత్రసీమనీ మరోసారి ఆశ్చర్యానికి గురిచేశాడు అడివి శేష్. నవంబర్ 26 ఘటనగా రికార్డయిన ముంబై ఉగ్ర దాడి ఉదంతంలో రియల్ హీరోగా నిలిచి, ఉగ్రవాదుల్ని ఎదిరించి, ఎంతో మంది ప్రాణాలు కాపాడి, తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను చేయబోతున్నానని అతను ప్రకటించడంతో శేష్‌లోని విలక్షణత్వం మరోసారి స్పష్టమైంది.

‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో ప్రేక్షకుల్ని ఊహాతీతంగా ఆకట్టుకున్నాడు శేష్. ఈ రెండు సినిమాలూ ఒక నటుడిగా, రచయితగా శేష్ అభిరుచికి అద్ధం పట్టాయి. తెలుగు సినిమాకి సరికొత్త వీక్షణానుభవాన్ని అందించాలనే అతడి తపనకు నిదర్శనంగా నిలిచాయి. అదే సమయంలో కంటెంట్ పరంగా తెలుగు సినిమా ఎదుగుతోందని చెప్పాలని ఆరాటపడే నవతరం ప్రతినిధిగా కూడా శేష్ కనిపిస్తున్నాడు.

ఫిబ్రవరి నెలాఖరుకు ఒక ముఖ్యమైన విషయం వెల్లడిస్తానని అతను ప్రకటించినప్పుడు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని చెప్తాడని ఊహించినవాళ్లు, అది అతడి పెళ్లి గురించే అయ్యుంటుందనే కోణంలో ఆలోచించి, దాన్ని తెరపైకి తెచ్చారు. ఒక అనవసర విషయం గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడేలా చేశారు.

అయితే తాను వెల్లడించాలనుకున్న విషయాన్ని శేష్ బయటపెట్టాడు. ఒక జాతి హీరో కథను తెరపైకి తెస్తున్నామంటూ ‘మేజర్’ సినిమా ప్రకటన చేశాడు. ఆ సినిమాని మహేశ్ సొంత నిర్మాణ సంస్థ జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండటమే ఇందులోని విశేషం. సోనీ పిక్చర్స్ ఇండియా వంటి బడా కార్పొరేట్ బేనర్ నిర్మాణంలో చేతులు కలపడమే ఇందులోని విశేషం.

ఇది నిజంగానే ఒక పెద్ద వార్త. అతడు వెల్లడించిన విషయానికీ, అదివరకు ప్రచారంలోకి వచ్చిన విషయానికీ ఏమన్నా పొంతన ఉందా?

‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేసే ఈ సినిమాకి రచన చేస్తూ, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నాడు శేష్. 2020 ఆరంభంలో రానున్న ఈ సినిమాతో శేష్ మనల్ని మరోసారి ఆశ్చర్యపరచడం ఖాయం.

'మేజర్'తో మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచిన శేష్!

Related article: