Alia Bhatt Has No Dates For RRR Due To Sadak 2 & Takht?

‘ఆర్ఆర్ఆర్’లో అలియా లేనట్లేనా?
రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’లో హీరోయిన్లు ఎవరనేది ప్రస్తుతానికి పెద్ద చిక్కుముడిలా తయారయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ తీసుకు రావాలంటే దేశానికంతటికీ తెలిసున్న తారలైతే బాగుంటుందని భావిస్తున్న రాజమౌళి బాలీవుడ్లోని పాపులర్ హీరోయిన్ల కోసం ప్రయత్నిస్తున్నాడు.
ఇందులో భాగంగా అలియా భట్, పరిణీతి చోప్రా పేర్లు బయటికి వచ్చాయి. రాంచరణ్ జోడీ కేరెక్టర్ కోసం ఇప్పటికే అలియాతో సంప్రదింపులు జరపడంతో ఆమె ఈ సినిమాలో ఖాయంగా నటించే అవకాశాలు ఉన్నట్లు కనిపించింది.
ఇదివరకే ప్రభాస్ సరసన ‘సాహో’ చేసే అవకాశం వచ్చినా బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేకపోయిన అలియా, ‘ఆర్ఆర్ఆర్’ను వదులుకోదని చాలామంది భావించారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అలియా ఈ ఆఫర్ను కూడా తిరస్కరించే అవకాశాలు ఉన్నాయంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
కారణం కొంత కాలం దాకా అలియా డైరీ ఖాళీగా లేదని సమాధానం వస్తోంది. రణ్వీర్ సింగ్తో ఆమె చేసిన ‘గల్లీ బాయ్’ గురువారం విడుదలవుతోంది. కొన్ని రోజుల పాటు ఆ సినిమా ప్రమోషన్లో ఆమె పాల్గొనాల్సి ఉంది. దాని తర్వాత విడుదల కావాల్సి ఉన్న ‘కళంక్’ ప్రమోషన్ కోసమూఒ ఆమె సమయం కేటాయించాలి.
ఇప్పటికే ‘సడక్ 2’, ‘తఖ్త్’ సినిమాలు చేయడానికి సంతకాలు చేసింది అలియా. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’కు డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టమని ఆ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ఇప్పటికే రెండో షెడ్యూల్ షూటింగ్ నడుస్తున్నందున హీరోయిన్ల ఎంపికను వీలైనంత త్వరగా పూర్తి చెయ్యడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నాడు.