వర్మవి పిల్ల చేష్టలా?!


వర్మవి పిల్ల చేష్టలా?!

సాధారణంగా వర్మ దేనికీ సంబరపడడు, హిపోక్రసీ చూపించడని పేరు. కానీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రాజెక్ట్ చేపట్టిన నాటి నుంచీ గమనిత్తుంటే, రోజురోజుకీ పిల్ల చేష్టలు ఎక్కువవుతున్నట్లు కనిపిత్తందే.

పిల్ల చేష్టలంటే చిన్నపిల్లల్ని తక్కువచెయ్యడం కాదు. అనుభవం లేక, తెలిసీ తెలియక తప్పటడుగులు వేత్తుంటారు పిల్లలు. అపరిపక్వ మనసుతో వాళ్లు చేసే పనుల్ని పిల్ల చేష్టలంటాం కదా.. సరిగ్గా ఆ తరహాలోనే ప్రెవర్తిత్తన్నాడు వర్మ.

ఇదివరకు వర్మ అంటే “ఆయనో పెద్ద పుడింగ్ రా” అని గొప్పగా చెప్పుకొనేటోళ్లు మనోళ్లు. “ఇప్పుడేంది ఈయన ఇట్టా చేత్తన్నాడు” అని ఆళ్లే అనుకుంటా వత్తన్నారు.

ఈ మధ్య ప్రెతి దానికీ “ఎన్టీఆర్ దీవిత్తన్నాడు, పైనుండి ఆశీర్వదిత్తన్నాడు”.. అని ట్విట్టర్ సాక్షిగా తెగ ఖుషీ అయిపోతన్నాడు వర్మ. ఎప్పటి సంగతో ఎందుకు.. ఇప్పుడు ఎన్టీఆర్ లక్కీ నంబర్ 9 అంట. 9 గంటల్లోనంట ఆయన రిలీజ్ చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లోని “నీ ఉనికి” అనే వీడియో సాంగ్‌కి 10 లచ్చల వ్యూస్ వొచ్చినాయంట.. దానికి లబలబ కొట్టుకుంటా తెగ మురుత్తా అలిసిపోతన్నాడు.

“అబద్ధపు ‘కథ’ కాదు. ‘మహా’గొప్పలు కాదు. ఈ విజయం కేవలం నిజం” అంటా తెగ గొప్పలు చెప్పుకున్నాడు. 10 లచ్చల వ్యూస్ వొత్తే ఏందంట. ఎవురికి ఏం వొరిగిందంట.

“మిగతావోళ్లు అబద్ధం చెప్పారే అనుకుందాం. వర్మ నిజం చెప్తున్నాడని గేరంటీ ఏంది? చరిత్రని ఎవుడి సౌలభ్యానికి తగ్గట్టు వాడు రాసేసుకుంటంటే ఏది అబద్ధమో, ఏది నిజమో ఎవడు తేలుత్తాడు. ‘నేను సాక్ష్యం’ అనేవాళ్లు నిజం చెబ్తున్నారని గ్యారంటీ ఏంది? ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నోళ్లే ఎక్కువ అబద్ధాలు చెప్తారు” అని ఒక పెద్దాయన అన్నాడు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో వర్మ చూపించినవన్నీ నిజాలని ఎవుడైనా ఎందుకనుకోవాలా? అయినా ఈ పిల్లచేష్టలేందబ్బీ.. నీ పనేంది.. సినిమాలు తియ్యడం. ఆ పని చేసుకోక, ఇంకోడి.. దాంట్లో ఏలెట్టి, ఆడ్ని తక్కువజేత్తా, నువ్వు హెచ్చులుపోవాల్సిన పనేంది? ఎవుడు నిజమో, ఎవుడు అబద్ధమో జనాలకి తెలీదనుకుంటన్నావా?

నువ్వు సినిమా తియ్యి. జనాల్లోకి తీసుకెళ్లు. ఆళ్లే చూస్కుంటారు. నువ్వు నిజమా, అబద్ధమా.. ఆళ్లే తేలుత్తారు. ఇప్పటికి ఎన్ని సార్లు తేల్చారో నీకు అనుభవమే కదా.. ఇంకేం. మద్దిలో ఈ వాగుడెందుకు.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని రిలీజ్ చెయ్యి సామీ.