Balakrishna And Boyapati Film’s Shoot To Begin In May


Balakrishna And Boyapati Film's Shoot To Begin In May
Balakrishna and Boyapati Sreenu

ఈ నెలలోనే బాలయ్య-బోయపాటి సినిమా ముహూర్తం

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు – ‘సింహా’, ‘లెజెండ్’ – ఒకదాన్ని మించి మరొకటి ఘన విజయం సాధించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ బాలకృష్ణ ఫ్లాపుల నుంచి బయటపడటం గమనార్హం. ఇప్పుడు మూడోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రానున్నది.

బాలకృష్ణ టైటిల్ రోల్ చేసిన ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ 22న విడుదలయ్యాక ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలకృష్ణ దీనికి ముహూర్తం నిశ్చయించారు కూడా. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం మరో మూడు నెలల తర్వాతే మొదలవుతుంది. కారణం మే నెలలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటం.

ఎమ్మెల్యేగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బాలయ్య, రానున్న ఎన్నికల్లో చురుకుగా పార్టీ తరపున ప్రచారం నిర్వహించనున్నాడు. అందువల్ల ఎన్నికలు పూర్తయిన తర్వాతనే షూటింగ్‌లోకి వెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నారు.

మునుపు తను రూపొందించిన రెండు సినిమాల్లోనూ బాలయ్యను లార్జర్ దేన్ లైఫ్ కేరెక్టర్లలో చూపించిన బోయపాటి, ఇప్పుడు అదే తరహాలో ఒక శక్తిమంతమైన పాత్రను సృష్టించాడని అంతర్గత వర్గాల సమాచారం. ఈ సినిమాని ఎన్‌బీకే ఫిలిమ్స్ బేనర్‌పై బాలకృష్ణ స్వయంగా నిర్మించనున్నారు.