క్విజ్: తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ గురించి మీకెంత తెలుసు?

మొట్టమొదటి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1931లో కాకుండా, 1932లో విడుదలైందని సీనియర్ సినీ పాత్రికేయుడు రెంటాల జయదేవ తనకు లభించిన కొన్ని ఆధారాల ద్వారా తెలియజేసిన విషయం సినిమా ప్రియులకు గుర్తుండే ఉంటుంది.
ఆయన దానికి సంబంధించిన వ్యాసం రాసిన తర్వాత కొంతమంది ఆయన చెప్పినదాన్నే నిజమని నమ్ముతూ వస్తున్నారు. అయితే ‘ప్రహ్లాద’ 1931లోనే విడుదలైందని చెప్పడానికి ఓ ఆధారం లభ్యమైంది.
నవోదయ పత్రిక 1947లో వెలువరించిన ప్రత్యేక పారిశ్రామిక సంచికలో యం.యస్. శర్మ ‘తెలుగు ఫిల్మ్ పరిశ్రమలో పరాయివారి పెట్టుబడి’ అనే వ్యాసంలో ‘ప్రహ్లాద’ 1931లో విడుదలైందని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాసం 1947లో రాసింది కాబట్టి ఈ కాలంలో రాసిన దానికంటే క్రెడిబిలిటీ దానికే ఎక్కువ ఉంటుంది.
ఈయనే కాదు, 1934 నుంచే సినిమారంగంతో సాన్నిహిత్యం కలిగి, అప్పట్నించే సినిమాపై వ్యాసాలు రాస్తూ వచ్చిన మహా రచయిత కొడవటిగంటి కుటుంబరావు సైతం 1953 అక్టోబర్ 1 ఆంధ్రప్రభ దినపత్రిక ఆంధ్రరాష్ట్ర అవతరణ సంచికలో రాసిన ‘తెలుగు చిత్రాలు – సింహావలోకం’ వ్యాసాన్ని “మొట్టమొదటి తెలుగు టాకీ ‘ప్రహ్లాద’ 1931లో వెలువడింది” అంటూ ప్రారంభించడం గమనార్హం.
1. ‘భక్త ప్రహ్లాద’ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి పూర్తి పేరు
ఎ)హనుమ మోహన రెడ్డి బి) హనుమప్ప మునియప్ప రెడ్డి సి) హనుమప్ప మదనప్ప రెడ్డి
2. ఈ సినిమాకు ఆధారమైన ‘భక్త ప్రహ్లాద’ నాటక రచయిత
ఎ) ధర్మవరం రామకృష్ణమాచార్యులు బి) మునిమాణిక్యం నరసింహాచార్యులు సి) స్థానం నరసింహారావు
3. ప్రహ్లాద పాత్రధారి
ఎ) ఎల్వీ ప్రసాద్ బి) సిందూరి కృష్ణారావు సి) చిత్రపు నరసింహారావు
4) షూటింగ్ జరిపిన ప్రాంతం
ఎ) మద్రాస్ బి) హైదరాబాద్ సి) బొంబాయి
5) ప్రహ్లాదుని తల్లి లీలావతిగా నటించిన తార
ఎ) శ్రీరంజని బి) సురభి బాలసరస్వతి సి) సురభి కమలాబాయి
6) తొలి భారతీయ టాకీ ‘ఆలం ఆరా’, తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ టాకీ ‘కాళిదాస్’ చిత్రాల్లో నటించిన నటుడు
ఎ) మునిపల్లె సుబ్బయ్య బి) ఎల్వీ ప్రసాద్ సి) పారుపల్లి సత్యనారాయణ
7) ఈ చిత్రానికి పాటలు రాసిన చందాల కేశవదాసు రాసిన ప్రసిద్ధ నాటకం
ఎ) కనకతార బి) లవకుశ సి) ప్రతాప రుద్రీయం
8. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు
ఎ) ప్రభల సత్యనారాయణ బి) మాధవ్ తాంబే సి) హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి
9. హిరణ్యకశిపుడి పాత్రధారి
ఎ) మునిపల్లె సుబ్బయ్య బి) దొరస్వామినాయుడు సి) పారుపల్లి సుబ్బారావు
10. చలామణిలో ఉన్న ‘భక్త ప్రహ్లాద’ విడుదల తేదీ
ఎ) సెప్టెంబర్ 25 బి) సెప్టెంబర్ 15 సి) అక్టోబర్ 15
జవాబులు: 1. హనుమప్ప మునియప్ప రెడ్డి 2. ధర్మవరం రామకృష్ణమాచార్యులు 3. సిందూరి కృష్ణారావు 4. బొంబాయి 5. సురభి కమలాబాయి 6. ఎల్వీ ప్రసాద్ 7. కనకతార 8. హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి 9. మునిపల్లె సుబ్బయ్య 10. సెప్టెంబర్ 15