చిరంజీవి సినిమా టైటిలా? మజాకా?


చిరంజీవి సినిమా టైటిలా? మజాకా?
‘గ్యాంగ్ లీడర్’గా చిరంజీవి

విక్రం కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమాకి ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాని పుట్టినరోజును పురస్కరించుకొని ఫిబ్రవరి 24న ఆ టైటిల్ ప్రకటించారు.

చిరంజీవి హీరోగా విజయ బాపినీడు రూపొందించిన ‘గ్యాంగ్ లీడర్’ (1991) సినిమా ఆ రోజుల్లో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ టైటిల్ తలచుకోగానే మనకు చిరంజీవే గుర్తుకొస్తారనేది నిజం. ఇప్పుడు ఆ టైటిల్‌తో నాని ఒక్క సాహసం చేస్తున్నట్లే లెక్క. ఎందుకంటే ఇప్పటివరకూ ఒకే ఒక సందర్భంలో మినహా మిగతా అన్ని సందర్భాల్లోనూ చిరంజీవి సినిమా టైటిల్‌తో తర్వాత వచ్చిన సినిమాలేవీ హిట్ కాకపోవడం. అవేమిటో చూద్దాం..

స్టేట్ రౌడీ

చిరంజీవితో బి. గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1989లో విడుదలై మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇదే పేరుతో 2007లో శివాజీ ఒక సినిమా చేశాడు. మల్లికా కపూర్ నాయికగా నటించిన ఈ సినిమాకు విక్రం గాంధీ దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది.

హీరో

చిరంజీవి, రాధిక జంటగా విజయ బాపినీడు రూపొందించిన ‘హీరో’ (1984) సినిమా యాక్షన్ ప్రియుల్ని ఆ రోజుల్లో అమితంగా ఆకట్టుకుంది. పాటలు కూడా పాపులర్ అయ్యాయి. ఈ టైటిల్‌తో నితిన్ చేసిన సినిమా 2008లో వచ్చింది. జీవీ సుధాకర్‌నాయుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భావన నాయిక. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

పులి

రాజభరత్ డైరెక్షన్‌లో రాధతో కలిసి చిరంజీవి నటించిన ‘పులి’ (1985) కూడా యాక్షన్ ప్రియుల్ని ఆకట్టుకుంది. ఇందులోని పాటలూ అలరించాయి. ఇదే పేరుతో పవన్ కల్యాణ్ 2010లో ఒక సినిమా చేశాడు. నికితా పటేల్ నాయికగా పరిచయమైన ఈ సినిమాని ఎస్.జె. సూర్య డైరెక్ట్ చేశాడు. పవన్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఇదొకటి.

యముడికి మొగుడు

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు’లో విజయశాంతి, రాధ హీరోయిన్లుగా నటించారు. కలెక్షన్ల పరంగా, పాటల పరంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా టైటిల్‌తో అల్లరి నరేశ్ 2012లో ఒక సినిమా చేశాడు. రిచా పనయ్ నాయికగా నటించిన ఈ సినిమాకి ఇ. సత్తిబాబు దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో నిర్మాత చంటి అడ్డాల భారీ స్థాయిలో నష్టపోయారు.

బిల్లా రంగా

మోహన్‌బాబుతో కలిసి చిరంజీవి చేసిన సినిమా ‘బిల్లా రంగా’ (1982). కె.ఎస్.ఆర్. దాస్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఫిలింలో రాధిక, స్వప్న నాయికలుగా నటించారు. థియేటర్లలో ఈ సినిమా బాగా ఆడింది. ఇదే పేరుతో 2014లో చిరంజీవి సమీప బంధువు (మేనత్త కొడుకు) వెంకట్ రాహుల్ చేసిన సినిమా ఘోరంగా ఫ్లాపయింది.

విజేత

అనిల్ కపూర్ సినిమా ‘సాహెబ్’కు రీమేక్‌గా చిరంజీవి నటించిన సినిమా ‘విజేత’ (1985). భానుప్రియ నాయికగా నటించగా, ఎ.కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. పాటలూ పాపులర్ అయ్యాయి. ఇదే పేరుతో 2018లో వచ్చిన సినిమాతో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయమయ్యాడు. మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కనీస స్థాయి వసూళ్లనూ సాధించలేకపోయింది.

ఇక 1986లో చిరంజీవి చేసిన ‘మగధీరుడు’ సినిమా బాగా ఆడింది. ఈ టైటిల్‌ని కాస్త మోడిఫై చేసి రాంచరణ్‌తో రాజమౌళి రూపొందించిన ‘మగధీర’ (2009) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చరిత్రను సృష్టించిందో మనకు తెలుసు. ఈ ఒక్క సందర్భంలోనే.. అది కూడా టైటిల్‌ని కాస్త మార్చి చేసిన సందర్భంలోనే ఫలితం అనుకూలంగా వచ్చింది.

చిరంజీవి సినిమా టైటిలా? మజాకా?
చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ లోగో

ఈ నేపథ్యంలో ఇప్పుడందరి కళ్లూ నాని చేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాపై పడుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి అభిమానులు ఆ సినిమాపై దృష్టి సారిస్తున్నారు. సో.. ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ నానికి బరువుగా మారుతుందో, కలిసొచ్చి చిరంజీవికి మల్లే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందో.. వేచి చూద్దాం.

– యజ్ఞ
చిరంజీవి సినిమా టైటిలా? మజాకా?