Director Differs Dil Raju On 96 Remake?

’96’ రీమేక్: దిల్ రాజుతో విభేదిస్తున్న దర్శకుడు
చూస్తుంటే ’96’ రీమేక్ ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రలు పోషించగా ఘన విజయం సాధించిన ’96’ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని దిల్ రాజు సంకల్పించారు. ఇప్పటికే ఈ సినిమాకు పనిచెయ్యడానికి శర్వానంద్, సమంత సంతకాలు కూడా చేశారు.
ఒప్పందం ప్రకారం ఒరిజినల్ డైరెక్టర్ ప్రేంకుమార్ ఈ సినిమానీ డైరెక్ట్ చెయ్యడానికి సిద్ధమయ్యాడు. అయితే సబ్జెక్ట్ విషయమై దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు అంతర్గత వర్గాల సమాచారం.
తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు కథలో చిన్న చిన్న మార్పులతో పాటు క్లైమాక్స్‌ను మార్చాలని దిల్ రాజు సూచించడంతో ప్రేంకుమార్ దానికి అంగీకరించలేదని అంటున్నారు. ఒరిజినల్‌ను యథాతథంగా తియ్యాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
చిన్నప్పుడు కలిసి చదువుకుని, ఒకరికి ఒకరు అన్నట్లు మెలిగిన ఒకబ్బాయి, ఒకమ్మాయి.. జీవితంలో విడిపోయి, కొన్నేళ్లు గడిచాక తాము చదువుకున్న స్కూలులో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళంలో కలుసుకున్నాక ఏం జరిగిందనేది ఇందులోని ప్రధానాంశం.
హృదయాన్ని స్పృశించే సన్నివేశాలతో, అందరికీ తమ స్కూల్ డేస్‌ను గుర్తుచేసే కథతో ప్రేంకుమార్ ’96’ను రూపొందించాడు. తెలుగు రీమేక్ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు సమసిపోతాయా? సినిమా పట్టాలెక్కుతుందా? వేచి చూడాలి.