Famous Director Vijaya Bapineedu Passes Away


Famous Director Vijaya Bapineedu Passes Away

సుప్రసిద్ధ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత

తెలుగు చిత్రసీమలో పేరుపొందిన దర్శకుడు విజయ బాపినీడు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆయన స్వస్థలం. సినీ రచయితగా కెరీర్ ఆరంభించి దర్శకునిగా, నిర్మాతగా రాణించారు. పత్రికాధిపతిగా, సంపాదకునిగానూ ఆయన వ్యవహరించారు.

చిరంజీవితో ఆయనది ప్రత్యేక అనుబంధం. ‘గ్యాంగ్ లీడర్’ (1991) సినిమా వారి కలయికలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. వారి కలయికలో ‘మగమహారాజు’ (1983), ‘మహానగరంలో మాయగాడు’ (1984), ‘మగధీరుడు’ (1986), ‘ఖైది నెం. 786’ (1988), ‘బిగ్ బాస్’ (1995) వంటి చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కువగా ఆయన శోభన్‌బాబును డైరెక్ట్ చేశారు.

‘భార్యామణి’ (1984), ‘మహారాజు’ (1985), ‘కొంగుముడి’ (1985), ‘దొంగల్లో దొర’, ‘కృష్ణ గారడి’ (1986), ‘పోలీస్ ఆఫీసర్’ (1986), ‘నాకూ పెళ్లాం కావాలి’ (1987), ‘పున్నమి చంద్రుడు’ (1987) ‘దొంగకోళ్లు’ (1988), ‘మా ఇంటి మహారాజు’ (1988), ‘మహారాజశ్రీ మాయగాడు’, ‘సుమంగళి’ (1989), ‘జూ లకటక’ (1989), ‘వాలుజడ తోలుబెల్టు’ (1992), ‘సీతపతి ఛలో తిరుపతి’ (1992) తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

రచయితగా ‘విషకన్య’ (1985), ‘హంతకులు దేవాంతకులు’ చిత్రాలకు కథలు అందించారు.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘నిప్పులాంటి నిజం’ (1980) చిత్రానికి ఆయన పబ్లిసిటీ ఇంచార్జిగా వ్యవహరించడం గమనార్హం.

మాగంటి రవీంద్రనాథ్ చౌదరి బేనర్ శ్యాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్‌లో మొదట ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసి, తర్వాత అదే బేనర్‌పై సమర్పకునిగా పలు చిత్రాలకు వ్యవహరించారు.