లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘సీతా కల్యాణం’


లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'సీతా కల్యాణం'
బాపు

విఖ్యాత చిత్రాకారుడు, చిత్ర దర్శకుడు బాపు 1979లో లండన్ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. ఇంగ్లండ్, జర్మనీ, అమెరికా దేశాల్లో పర్యటించారు. ఆయన దర్శకత్వంలో సీతారాములుగా రవి, జయప్రద నటించిన ‘సీతా కల్యాణం’ (1976) చిత్రం నవంబర్ 25న షికాగోలో, నవంబర్ 28న లండన్‌లో ప్రదర్శితమై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

అక్కడి పత్రికలు ఆ సినిమాని ఎంతగానో ప్రశంసించాయి. డిసెంబర్ 7న లండన్ నేషనల్ థియేటర్‌లో ఏర్పాటు చేసిన బాపు చిత్రకళా ప్రదర్శనలోని చిత్రాల సౌందర్యం చూసి సందర్శకులంతా అబ్బురపడ్డారు.

సీతా కల్యాణం (1976)

శ్రీరామునిగా నూతన నటుడు రవి, సీతగా జయప్రద నటించిన ఈ సినిమాలో రావణాసురుని పాత్రను కైకాల సత్యనారాయణ పోషించారు. దశరథ, విశ్వామిత్ర పాత్రల్ని గుమ్మడి, ముక్కామల చేశారు. ముళ్లపూడి వెంకటరమణ కథ, సంభాషణలు అందించారు.

ఆరుద్ర, సి. నారాయణరెడ్డి రాసిన పాటలకు కె.వి. మహదేవన్ బాణీలు కట్టారు. కె.ఎస్. ప్రసాద్ ఛాయాగ్రహణాన్ని అందించిన ఈ చిత్రాన్ని ఆనందలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బేనర్‌పై పింజల ఆనందరావు నిర్మించారు.

బాపు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని పొందింది.  

లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'సీతా కల్యాణం'