ఆస్కార్ బెస్ట్ పిక్చర్ ‘గ్రీన్ బుక్’


ఆస్కార్ బెస్ట్ పిక్చర్ 'గ్రీన్ బుక్'

91వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ పిక్చర్‌గా ‘గ్రీన్ బుక్’ నిలిచింది. దాంతో పాటు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (మహర్షల్లా అలీ), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డ్స్ సైతం దానికి దక్కాయి.

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ ప్రపంచ ప్రసిద్ధ అవార్డ్స్ వేడుకలో ఉత్తమ దర్శకుడిగా ‘రోమా’ను రూపొందించిన అల్ఫాన్సో క్యూరాన్ అవార్డును అందుకున్నాడు. ‘రోమా’కు బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ అవార్డ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ కూడా లభించాయి.

‘ద ఫావరైట్’లో క్వీన్ అన్నే పాత్ర పోషించిన ఒలీవియా కోల్మన్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్‌ను అందుకుంది. ‘బొహీమియన్ రాప్సొడీ’ సినిమాలో ఫ్రెడ్డీ మెర్క్యురీగా అసమాన నటనను ప్రదర్శించిన రామి మలెక్ బెస్ట్ యాక్టర్ ట్రోఫీని చేజిక్కించుకున్నాడు. ఇదే సినిమాకు సౌండ్, ఎడిటింగ్ అవార్డ్స్ దక్కాయి.

ప్రపంచవ్యాప్తంగా సినీప్రియుల్ని అలరించి బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన ‘బ్లాక్ పాంథర్’ సినిమా బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ కాస్ట్యూం డిజైన్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డుల్ని సాధించింది.

‘ఎ స్టార్ ఈజ్ బార్న్’ సినిమాలో ఫేమస్ అయిన ‘షాలో’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలవగా, ఆ పాటకు స్టేజిపై లేడీ గాగా, బ్రాడ్లీ కూపర్ లైవ్ పర్ఫార్మన్స్ ఇచ్చారు. గునీత్ మోంగా నిర్మించగా ఇండియా నేపథ్యంలో తీసిన ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్.’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ అవార్డును కైవసం చేసుకోవడం గమనార్హం.