I’m Fat Due To Hormonal Problems: Vidya Balan


I'm Fat Due To Hormonal Problems: Vidya Balan
Vidya Balan

హార్మోన్ల సమస్య వల్లే లావుగా ఉన్నా: విద్యా బాలన్

నటిగా పద్నాలుగేళ్ల కెరీర్‌లో విద్యా బాలన్ ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరించారు. ‘పరిణీత’లో నంగనాచి లలిత కేరెక్టర్‌తో అందర్నీ తనవేపు తిప్పుకొన్న ఆమె, ‘ద డర్టీ పిక్చర్’లో సెన్సిబుల్ సిల్క్‌గా ఉర్రూతలూగించారు. ఎంచుకొనే పాత్రలు, ఎవరేమనుకున్నా లెక్కచెయ్యని ఆహార్యంతో ఆమె తరచూ స్టీరియోటైప్‌లను బ్రేక్ చేస్తూ వస్తున్నారు.

ఆమె విషయంలో చాలామంది చేసే ఫిర్యాదు లావుగా కనిపిస్తుందని. ఫిగర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటుందని చాలామంది వ్యాఖ్యానిస్తుంటారు. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు చిన్నతనం నుంచే హార్మోన్ల సమస్య ఉందనీ, అందుకే బరువు తగ్గడమనేది తనకు భారమైపోయిందనీ చెప్పుకొచ్చారు.

“నా జీవితమంతా ఈ సమస్యను ఎదుర్కొంటూ వస్తూనే ఉన్నా. నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు జనం ‘నీది చాలా అందమైన ముఖం. కాస్త బరువు తగ్గితే ఇంకా బావుంటావు’ అనేవాళ్లు. వాళ్లందరికీ నా సమస్య ఎలా చెప్పుకోను! చిన్నతనం నుంచీ ఇప్పటి దాకా కూడా ఈ ప్రశ్న ఎదుర్కొంటూనే ఉన్నా. ఎవరికి తెలుసు, నేనెంత క్లిష్టమైన వ్యాయామాలు కూడా చేశానో! దాని వల్ల బరువు తగ్గాను కూడా. అప్పడు హార్మోన్ సమస్య తీరిపోయిందని కూడా అనుకున్నా. కానీ అది మళ్లీ తలెత్తుతూనే ఉంది. ఈ విషయంలో అలసిపోయాను” అని తెలిపారు విద్య.

ఆమె సన్నగా మారినప్పుడు కూడా లావుగా ఉన్నట్లే ఫీలయ్యేది. “బరువు తగ్గడం, పెరగడం, బరువు తగడం, పెరగడం.. చాలా కాలం ఇదే స్థితి. కొన్నేళ్ల క్రితం నుంచే నేను చేసిన సీన్లను మానిటర్‌లో చూడ్డం మానేశా. ఎందుకంటే మానిటర్‌లో చూసినప్పుడల్లా, ‘నేను లావుగా కనిపిస్తున్నానా?’ అనుకొనేదాన్ని” అని చెప్పారు విద్య.

తెలుగులో ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’, తమిళంలో ‘పింక్’ రీమేక్ చేస్తోన్న ఆమె ప్రఖ్యాత గణితవేత్త శకుంతల బయోపిక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

I'm Fat Due To Hormonal Problems: Vidya Balan
A still from Tumhari Sulu