KGF: One Ghastly Episode We Must Avoid


KGF: One Ghastly Episode We Must Avoid
Yash in KGF

కేజీఎఫ్: పరిహరించాల్సిన ఒక అభ్యంతరకర సన్నివేశం

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కె.జి.ఎఫ్’ సినిమా విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఏడో వారంలోనూ తెలుగు రాష్ట్రాల్లో అనేక థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాతో ఇటు హీరోగా యశ్, అటు డైరెక్టర్‌గా ప్రశాంత్ యమ క్రేజ్ సంపాదించేశారు.

బిగువైన స్క్రీన్‌ప్లేతో, ఉత్కంఠ సడలని, భావావేశాల్ని రేకెత్తించే సన్నివేశాలతో ‘కె.జి.ఎఫ్’ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్నిచ్చింది. సబ్జెక్ట్‌లో అరాచకత్వం ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చినా సరే, ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

సినిమాలో హింస ఎక్కువనేది నిజం. మాఫియా గ్యాంగుల మధ్య పోటీ అంటేనే హింసకు చోటెక్కువ. ఆ హింస సంగతి అలా ఉంచితే ఒక సన్నివేశం అనైతిక విలువలకు పరాకాష్ఠగా అనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా ఆ సన్నివేశం విలన్ గ్యాంగ్‌కు చెందింది కాదు. స్వయంగా హీరో హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశం. ఆ ఇద్దరూ అరాచక ప్రవర్తనకు పాల్పడే సన్నివేశం. అది హీరోయిన్ (నిధి శెట్టి) పరిచయ సన్నివేశం కూడా.

KGF: One Ghastly Episode We Must Avoid
A Still from KGF

తొలిసారి బెంగళూరుకు వచ్చిన రాకీ (యశ్) ఒక టాక్సీలో వెళ్తుంటే ట్రాఫిక్ జాం అవుతుంది. ఎందుకు జాం అయ్యిందని అక్కడ్నుంచి పారిపోతున్న ఒకడ్ని డ్రైవర్ అడిగితే ఎలక్షన్ల వల్ల వైన్ షాపులు, బార్లు మూసేశారనీ, దాంతో రాజేంద్ర దేశాయ్ కూతురు రీనా, ఆమె గ్యాంగ్ రోడ్డు మీదే మందు కొడుతున్నారనీ, అందుకే రోడ్ బ్లాకయ్యిందనీ చెప్తాడు.

ఈ లోపు కొంతమంది ఒకడ్ని వెంటాడుతూ పట్టుకొని చావగొడ్తుంటారు. వాడు రీనా ముఖం చూసినందునే కొడ్తున్నారని తెలుస్తుంది. దాంతో అంతదాకా ట్యాక్సీలో మందుకొట్టిన రాకీ కిందికి దిగి రీనా దగ్గరికి వెళ్తాడు. ఆమె, ఆమె స్నేహితురాళ్లు బాటిళ్లు ఎత్తి మందు కొడ్తుంటారు.

నేరుగా రీనా దగ్గరికి వెళ్లి “కంగ్రాచ్యులేషన్స్” అంటాడు రాకీ. “వై?’ అనడుగుతుంది రీనా. “ఐ లవ్ యూ” అని చెప్తాడు.

రీనా – “హౌ డేర్ యూ?”

రాకీ – “హౌ ఫేర్ యూ!”

KGF: One Ghastly Episode We Must Avoid
A Still from KGF

దాంతో రాకీని కొట్టమని కోపంగా తన మనుషులకి పురమాయిస్తుంది రీనా. సహజంగానే వాళ్లనందర్నీ చితగ్గొడతాడు రాకీ. ఒక రౌడీ తనను కొట్టడానికి మందు బాటిల్ పగలగొడ్తే.. రాకీ “నీ యబ్బ.. నా మందంతా వేస్ట్ చేశావ్ కదరా..” అని వాడ్ని రక్తం కక్కేట్లు తీవ్రంగా కొడ్తాడు. “మందు విలువ నీకేం తెలుస్తుందిరా.. తాగేవాడికి తెలుస్తుంది” అని వాడ్ని బీభత్సంగా కొడ్తాడు.

“బేంగ్‌ళూర్‌కు ఫస్టైం వచ్చావనుకుంటా. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. తెలిశాక పారిపోకు. ఎందుకంటే మా నాన్న నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరీ ఇదే రోడ్డు మీద చంపేస్తాడు” అని వార్నింగ్ ఇస్తుంది రీనా.

తాగిన మత్తులో ఊగుతూ “నాకు పరిగెత్తించడమే కానీ పరిగెత్తడం తెలీదు. నా జర్నీలో చాలామంది కిలాడీలను చూశా. అయితే కిల్లేడీని మాత్రం ఫస్టైం చూస్తున్నా. లవ్‌లోకి డీప్‌గా గోయింగ్.. నీ బాబెవరు? రాజేంద్ర దేశాయ్. నీ బాబు నిన్ను సుఖంగా చూసుకుంటున్నాడు. నేన్నీకు అంతకు మించిన సుఖాన్నిస్తా.. డోంట్ వర్రీ. నేన్నిన్నొదిలి ఎక్కడికీ వెళ్లను. ఐ విల్ కమింగ్ సూన్.. (రౌడీల వైపు తిరిగి) రేయ్.. ఇప్పట్నించి వీళ్ల నాన్న నా మావ, నేను మీ అందరికీ బావ.. నీ యక్క. నన్ను బాగా చూసుకోండ్రా” అని వెళ్తాడు రాకీ.

KGF: One Ghastly Episode We Must Avoid
A Still from KGF

ఈ సన్నివేశం చదివితేనే ఎంత అరాచకంగా ఉందో అర్థమైపోతోందిగా. రోడ్డుపై వెళ్లే జనానికి అంత ఇబ్బంది కలగజేస్తూ, అక్కడే తన ఫ్రెండ్స్‌తో మందుకొడ్తున్న రీనాకి రాకీ ‘ఐ లవ్ యూ’ చెప్పడం, మందు బాటిల్ పగలగొట్టిన రౌడీని మందంతా వేస్ట్ చేశావని భయానకంగా చితగ్గొట్టడం ఒళ్లు జలదరింపజేసే విషయం.

అంతకంటే “నీ బాబు నిన్ను సుఖంగా చూసుకుంటున్నాడు. నేన్నీకు అంతకు మించిన సుఖాన్నిస్తా. డోన్ట్ వర్రీ” అనడం మరీ దారుణం. సాధారణంగా కూతుర్ని తండ్రి సుఖపెట్టడమనే మాట వాడరు. కూతుర్ని తండ్రి ఏ లోటూ లేకుండా బాగా చూసుకుంటూ ఉన్నాడని అంటారు కానీ సుఖపెడుతున్నాడనరు.

భార్యాభర్తలకో, ప్రేమికులకో, లేదా ఒకరి వద్ద శృంగారపరంగా ఆనందం పొందితేనో సుఖమనే మాట వాడతాడు. లేదూ సామాన్య అర్థంలో ఎవడైనా బాగా బతుకుతుంటే ‘వాడు సుఖంగా బతుకుతున్నాడు’ అంటారు.

“నీ తండ్రి ఇచ్చే సుఖాన్ని మించిన సుఖాన్నిస్తా” అంటే అందులో ఎంత బూతు ఉంది! దీన్ని సెన్సార్ సభ్యులు ఎందుకు గుర్తించలేదో అర్థం కాదు. వాళ్లకు అర్థమై ఉండదు.. లేదా.. పట్టించుకొని ఉండరు.

ఏ రకంగా చూసినా ఇది నైతికతకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన ఎపిసోడ్. కచ్చితంగా పరిహరించాల్సిన సన్నివేశాల సమాహారం.

– బుద్ధి యజ్ఞమూర్తి

KGF: One Ghastly Episode We Must Avoid
A Still from KGF