Lakshmi’s NTR: The Ultimate Love Story Of Andhra Pradesh By Ram Gopal Varma!

ఎన్టీఆర్ సూచిస్తున్నాడు.. వర్మ పాటిస్తున్నాడు!
‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ సినిమా ఫ్లాపయ్యేసరికి ఆ సినిమాకు సంబంధించిన వాళ్లందరూ రాంగోపాల్ వర్మకు అలుసైపోయారు. “తన సొంత కొడుకు తీసిన ‘కథానాయకుడు’ని ఎన్టీఆర్ ఆశీర్వదించలేదనేని వాస్తవం. తన భార్యకు చెందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ఆయన ఆశీర్వాదాలున్నాయనడానికి అదే నిదర్శనం. ‘మహానాయకుడు’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలల మధ్య క్లాష్కు అది నిదర్శనం. ఎన్టీఆర్ ఆశీర్వదించవచ్చు” అని ట్వీట్ చేశారు గత ఏడాది ‘ఆఫీసర్’తో నాగార్జునకు కెరీర్ బెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన వర్మ. గతంలో ఎన్నడూ దేవుడి వైపు నిలబడని ఆయన కొంత కాలంగా దేవుని బిడ్డ అయిపోయారు. ఇప్పుడు స్వర్గం గురించి కూడా మాట్లాడుతున్నారు. “మహానాయకుడు విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన వచ్చిన సరిగ్గా 24 నిమిషాలలోగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రిలీజ్ చెయ్యమని స్వర్గం నుంచి ఎన్టీఆర్ నన్ను హెచ్చరించారు” అని చెప్పారు కొంత కాలం క్రితం మియా మల్కోవా అనే అడల్ట్ సినిమాల నటితో ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా తీసిన రాంగోపాల్ వర్మ.
బయటపడడు కానీ ప్రేమకథలంటే వర్మకు మక్కువ ఎక్కువ. అందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ఒక లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. అది అలాంటిలాంటి లవ్ స్టోరీ కాదు. “దేవదాసు, లైలా మజ్ఞు వగైరా వగైరా కంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనేది ఆంధ్రప్రదేశ్ అల్టిమేట్ లవ్ స్టోరీ” అని ‘ఎటాక్’ అనే అల్టిమేట్ పొలిటికల్ థ్రిల్లర్ తీసిన ఆయన ఘంటాపథంగా చెప్పగలడు. సో.. త్వరలోనే మనం ఒక అద్భుత, తెలుగు సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని ఒక ప్రేమ కథాచిత్రాన్ని కనులారా వీక్షించబోతున్నాం. ఆ సినిమా ‘బాహుబలి’ రికార్డుల్ని అధిగమించి సరికొత్త చరిత్రను లిఖింపజేస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు ఎన్టీఆర్ ఆశీర్వాదాలున్నాయి కదా. నిదర్శనాలు కావాలంటే వర్మ తీసిన ‘వంగవీటి’, ‘365 డేస్’, ‘ఐస్ క్రీం’, ‘అనుక్షణం’, ‘సత్యా 2’, ‘దొంగల ముఠా’, ‘కథ స్క్రీన్ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ చిత్రాలను గుర్తు చేసుకోవచ్చు.
