Lovers Day Producers Says Nearly 200 People Have Been Competing For The Film Rights

Lovers Day Producers Says Nearly 200 People Have Been Competing For The Film Rights
Gururaj and Vinod Reddy

‘లవర్స్ డే’ తెలుగు హక్కుల కోసం 200 మంది దాకా పోటీపడ్డారు: నిర్మాతలు

ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ జంటగా డైరెక్టర్ ఒమర్ లులు రూపొందించిన సినిమా ‘లవర్స్ డే’. మలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’ సినిమాకి ఇది తెలుగు డబ్బింగ్ రూపం.

ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా తెలుగులో దాన్ని విడుదల చేస్తున్న గురురాజ్, వినోద్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు.

ఇవాళ ప్రియా వారియర్ పేరు తెలీనివాళ్లు లేరనీ, సినిమాలో ఆమె ప్రదర్శించిన హావభావాలు హైలైట్ అవుతాయనీ వాళ్లన్నారు.

“ఆమె నటించగా ఎంతో క్రేజ్ పొందిన సినిమాని తెలుగులో విడుదల చేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. సుమారు 200 మంది ఆ సినిమా హక్కుల కోసం పోటీ పడ్డారు” అని వాళ్లు తెలిపారు.

ఇప్పటి వరకూ ఏ మలయాళ సినిమాకూ ఇంత ధర పలకలేదనీ, సినిమాపై నమ్మకంతోనే భారీ ధర చెల్లించి హక్కులు పొందామనీ గురురాజ్ చెప్పారు.

“వాస్తవానికి మొదట ఈ సినిమాని చిన్న బడ్జెట్‌తో ప్రారంభించారు. తర్వాత వచ్చిన క్రేజ్‌తో కథ మార్చి భారీ వ్యయంతో చిత్రాన్ని తీశారు” అని వినోద్ రెడ్డి తెలిపారు.

దర్శకుడు ఒమర్ లులుకు ఇది మూడో సినిమా అనీ, మునుపటి రెండు సినిమాలూ హిట్టయ్యాయని ఆయనన్నారు.

“మేం మొత్తం డబ్బులు చెల్లించక ముందే ఒరిజినల్ ప్రొడ్యూసర్లు మమ్మల్ని పిలిపించి సినిమా చూపించారు. సాధారణంగా అలా ఎవరూ చేయరు. మాకు భాష తెలీకపోయినా సినిమా చూస్తున్నంతసేపూ ఒక చక్కని సినిమా చూస్తున్న అనుభూతి చెందాం. మా ఆనందానికి హద్దుల్లేవు” అని గురురాజ్ చెప్పారు.

ఇటీవల విడుదల చేసిన ఆడియో, టీజర్లకు తాము ఊహించని స్పందన వచ్చిందనీ, సినిమాలో తొమ్మిది పాటలుంటాయనీ వారు చెప్పారు.

“ఒక పాటకు ఉద్వేగంతో ప్రేక్షకులు లేచి నిల్చుంటారు. అంత గొప్పగా ఆ పాట ఉంటుంది. మాది డబ్బింగ్ సినిమా అయినా ఆడియో ఫంక్షన్‌కు గెస్ట్‌గా హీరో అల్లు అర్జున్ రావడం ఒక విశేషం. ఆయనకు ఎంతగా థాంక్స్ చెప్పినా తక్కువే” అన్నారు.

టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 20 లక్షల వ్యూస్ రావడం సినిమాపై నమ్మకం పెంచిందన్నారు. “ఇది ప్రేమ కథాచిత్రమైనా, స్నేహానికి కూడా కథలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. సోమవారం ఫ్రెండ్‌షిప్ సాంగ్‌ను విడుదల చేస్తున్నాం” అన్నారు.

కుటుంబమంతా కలిసి హాయిగా ఆస్వాదించే రీతిలో సినిమా ఉంటుందని వాళ్లు చెప్పారు. త్వరలో నేరుగా భారీ వ్యయంతో ఒక సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేసున్నామని తెలిపారు.