మహేశ్ యాక్టరా? బిజినెస్‌మ్యానా?


Mahesh: Actor Or Businessman?
Mahesh in Businessman Movie

కొంత కాలంగా మహేశ్ చేస్తున్న సినిమాలు, నటన కాకుండా చేస్తున్న ఇతర పనులు చూస్తుంటే.. పక్కా బిజినెస్‌మ్యాన్‌లా కనిపిస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సినిమాతో ఎలా లాభపడాలి? తన ఇమేజ్‌ను ఎలా క్యాష్ చేసుకోవాలి? కమిట్ అయి, అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలతో ఎలాంటి డీల్ కుదుర్చుకోవాలి?.. వంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడని మహేశ్ అభిమానులే చెప్పుకుంటున్నారు.

అంతెందుకు? ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘మహర్షి’ విషయానికే వస్తే.. ముగ్గురు నిర్మాతల్ని కలిపేసి, ఎవరికీ సంతృప్తి లేకుండా చేశాడని వినిపిస్తోంది. తనను ‘రాజకుమారుడు’తో పరిచయం చేసిన నిర్మాత సి. అశ్వినీదత్‌కు సినిమా చేస్తానని నాలుగేళ్ల క్రితమే కమిట్ అయ్యాడు మహేశ్. అప్పట్లో క్రిష్ డైరెక్షన్‌లో ఆ సినిమా వస్తుందనీ, సోనాక్షి సిన్హా నాయికగా నటిస్తుందనీ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ అది అటకెక్కేసింది.

అలాగే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత నిర్మాత దిల్ రాజుతో మరో రెండు సినిమాలకు మహేశ్ డీల్ కుదుర్చుకున్నాడు. మరోవైపు తనతో ‘బ్రహ్మోత్సవం’ తీసి భారీ నష్టాలు చవిచూసిన పీవీపీతో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. విడివిడిగా వాళ్లతో సినిమాలు చేయాల్సిన మహేశ్, అందుకు భిన్నంగా ముగుర్నీ నిర్మాణ భాగస్వాముల్ని చేసి ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడనీ, దీంతో ఆ ముగ్గురిలో ఎవరూ తృప్తిగా లేరనీ ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ సంగతలా ఉంచితే ‘మహర్షి’ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చెయ్యడానికి ఇప్పటికే అంగీకరించాడు మహేశ్. ఆ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉంది. ఆ సంస్థ ఇప్పటికే మహేశ్‌కు అడ్వాన్స్ చెల్లించింది. ఎప్పుడు ఏ డైరెక్టర్ సక్సెస్‌లో ఉంటే, ఆ డైరెక్టర్‌కి జైకొట్టే అలవాటున్న మహేశ్, నిన్న ‘రంగస్థలం’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన సుకుమార్‌కు జై అని, ఇప్పుడు ‘ఎఫ్2’తో బంపర్ హిట్ సాధించిన అనిల్ రావిపూడికి జై కొట్టి అతనితో సినిమా చెయ్యడానికి ఒప్పేసుకున్నాడు.

నిర్మాత అనిల్ సుంకరతో సినిమా చెయ్యడానికి కమిట్ అయిన మహేశ్.. ఆ సినిమా నిర్మాణ బాధ్యతల్ని అప్పగించాడు. దీంతో మహేశ్ ఎప్పుడు ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడో, ఆ సినిమాకి నిర్మాతలుగా ఎవర్ని ఎంచుకుంటాడో చివరి నిమిషం దాకా తెలీకుండా పోతోందనే టాక్ టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తూ ఉంది.

కథ వినకుండానే సుకుమార్‌తో సినిమా చెయ్యడానికి మహేశ్ కమిట్ అయ్యాడంటే ఎవరూ నమ్మరు. అలాంటప్పుడు చెయ్యడానికి ఒప్పుకున్నాక, అతన్ని పక్కన పెట్టి, మరో డైరెక్టర్‌ని సీన్‌లోకి తేవడం ఎంతవరకు కరెక్ట్? ఇంతకీ ‘మహర్షి’ తర్వాత మహేశ్ ఏ డైరెక్టర్‌తో పనిచేయబోతున్నాడు? సుకుమార్‌తోనా? లేక అనిల్ రావిపూడితోనా? లేక ఇంకో కొత్త డైరెక్టర్ సీన్‌లోకి వస్తాడా? ఏ నిర్మాతలకు అవకాశమివ్వబోతున్నాడు? ఇప్పటికే కమిట్ అయినవాళ్లకా? కమిట్ కాబోతున్నవాళ్లకా? సోలో నిర్మాతకా? పలు నిర్మాతలకా?

చేసేదే ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమా. దానికి ఇంత ‘సినిమా’ చూపించాలా? ఇప్పటికి హీరోగా 20 ఏళ్ల కెరీర్‌లో 25వ సినిమా మాత్రమే చేస్తున్న మహేశ్.. కెరీర్ మొత్తమ్మీద 50 సినిమాలైనా చేస్తాడా?.. అనే సందేహం కలుగుతోంది.

ఇదే సమయానికి మహేశ్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ 200 సినిమాలు చేసేశారు. ఈ క్రమంలో వేలాది కార్మిక కుటుంబాలకు ఉపాధి దక్కేలా చేశారు. 65 ఏళ్లు వచ్చేవరకూ తన జీవితాన్నంతా సినిమాకే అంకితం చేశారు. తన ఇమేజ్‌తో వ్యాపారం చేసుకోవాలని ఆయనెప్పుడూ యత్నించలేదు. కానీ మహేశ్ అందుకు భిన్నంగా తన ఇమేజ్‌ను ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా క్యాష్ చేసుకుంటున్నాడని అభిమానులే చెప్పుకుంటున్నారు.