‘తలైవి’గా జయలలిత బయోపిక్


'తలైవి'గా జయలలిత బయోపిక్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత అధికారిక బయోపిక్‌కు ‘తలైవి’ అనే టైటిల్ నిర్ణయించారు. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేసే ఈ సినిమాని విబ్రి మీడియా బేనర్‌పై విష్ణువర్ధన్ ఇందూరి నిర్మించనున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’లకు బాలకృష్ణతో పాటు విష్ణువర్ధన్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.

జయలలిత జయంతి (ఫిబ్రవరి 24)ని పురస్కరించుకొని ‘తలైవి’ టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి వి. విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును సమకూరుస్తుండటం గమనార్హం. జి.వి. ప్రకాశ్‌కుమార్ సంగీత దర్శకుడిగా, నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

ఈ సినిమా స్క్రిప్టు విషయంలో 9 నెలలుగా పరిశోధన, అధ్యయనం జరుగుతూ వచ్చాయని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో జయలలిత పాత్రను ఎవరు పోషిస్తున్నారనే విషయంతో పాటు ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందనే విషయాన్నీ అతి త్వరలో వెల్లడించనున్నారు.

ఇప్పటికే నిత్యా మీనన్ టైటిల్ రోల్ చేస్తున్న ‘ది ఐరన్ లేడీ’ అనే జయలలిత బయోపిక్ సెట్స్‌పై ఉంది. దీన్ని ప్రియదర్శిని అనే లేడీ డైరెక్టర్ రూపొందిస్తున్నారు.

అలాగే మరో రెండు బయోపిక్‌లు సైతం రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తమదే అధికారిక బయోపిక్ అని ‘తలైవి’ నిర్మాతలు ప్రకటించారు. జయలలిత మేనల్లుడు దీపక్ నుంచి ‘ఎన్‌వోసీ’ (నో అబ్జెక్షన్ సరిటిఫికెట్) తీసుకున్నట్లు తెలిపారు.

'తలైవి'గా జయలలిత బయోపిక్
Jayalalitha (file photo)