Manikarnika Controversy: Finally Kangana Breaks The Silence


Manikarnika Controversy: Finally Kangana Breaks The Silence
A still from Manikarnika

మణికర్ణిక వివాదం: మౌనం వీడిన కంగన

‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమా దర్శకత్వానికి సంబంధించి క్రిష్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఎట్టకేలకు మౌనం వీడింది కంగనా రనౌత్. స్విట్జర్లాండ్‌లో తన కుటుంబంతో కలిసి సెలవులు గడిపి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆమెను జర్నలిస్టులు చుట్టుముట్టారు.

డైరెక్టర్ క్రిష్, నటులు సోనూ సూద్, మిష్టి చక్రవర్తి, రచయిత అపూర్వ అస్రాని చేసిన ప్రకటనల గురించి అడిగారు. దానికి “క్రిష్‌కి ఒక సలహా ఇస్తున్నా.. సోనూ సూద్, మిష్టీ చక్రవర్తి, అపూర్వ అస్రానిని తీసుకొని ఒక సినిమా చేసి నాకు పాఠం బోధించమని” అని జవాబిచ్చింది కంగన.

ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు “ఆ రకంగా నాపై దాడి చెయ్యడం క్రిష్ చేసిన తప్పు. అతను కరెక్టయితే, ఆయన దాన్ని నిరూపించుకోవాలి. మీడియాతో మాట్లాడటం వల్ల ఆయనకు ఒరిగేదేమీ ఉండదు. ‘మణికర్ణిక’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అదృష్టమో, దురదృష్టమో ఆ సినిమాని నేను డైరెక్ట్ చేశాను. సినిమా బయటకు వచ్చేసినందువల్ల దానిపై చేసేదేమీ లేదు. నా పాత్రను కట్ చేశారనో, ఒక సీన్‌ని నేను ఎడిట్ చేశాననో మాట్లాడేవాళ్లకు ఒక విషయం చెప్పదలచుకున్నా. నేను సాధించిన ఈ స్థానం.. ఒక నటిగా లేదా మూడుసార్లు జాతీయ పురస్కార గ్రహీతగా లేదా దర్శకురాలిగా.. నా స్వయంకృషితో సాధించిందే. ఇది మా నాన్న ఇచ్చింది కాదు. మీ కృషితో ఈ స్థాయికి రండి. ఏడ్చినందువల్ల, ఎవరికీ లాభం ఉండదు” అని చెప్పింది కంగన.

“చివరి నిర్ణయాలన్నీ నేనే తీసుకున్నా. సినిమాని క్రిష్ నా చేతుల్లో పెడితే, ఒక డైరెక్టర్‌గా చివరి నిర్ణయాలు తీసుకోవడం అనేది నా ప్రత్యేక హక్కు. జీవితంలో స్ట్రగుల్ అయినవాళ్లు నా నుంచి ప్రేరణ పొందుతారు. అసూయ ద్వారా, నాపై దాడి చేయడం ద్వారా వాళ్లేమీ పొందలేరు” అని కూడా ఆమె చెప్పింది.

మరోవైపు బాక్సాఫీస్ వద్ద ‘మణికర్ణిక’ బాగానే నడుస్తోంది. ఇప్పటికి రూ. 60 కోట్లకు పైగా వసూలు చేసింది.