Massive Manhunt Launched Against Mastermind Of Pulwama Attack


Massive Manhunt Launched Against Mastermind Of Pulwama Attack
Security Forces

జైషే మొహమ్మద్ చీఫ్ కమాండర్ అన్న కొడుకు కోసం వేట మొదలైంది

జైషే మొహమ్మద్ (జేఈఎం) చీఫ్ కమాండర్ మౌలానా మసూద్ అజార్ అన్న కొడుకు మొహమ్మద్ ఉమైర్‌ను పట్టుకోవడం కోసం భారీ స్థాయి బృందం ఏర్పాటయ్యింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్‌పై జరిగిన బాంబుదాడి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ అతనేనని తెలుస్తోంది.

ఈ సందర్భంగా జేఈఎం తరపున ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (ఓజీడబ్ల్యు)గా పనిచేస్తున్న వారితో పాటు, అనుమానితులుగా భావిస్తున్న సుమారు రెండు డజన్ల మందిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి.

భద్రతా బలగాలు వెతుకుతున్న ఉమైర్.. జైషే మొహమ్మద్ స్థాపకుడు, చీఫ్ అయిన మౌలానా అజార్ అన్న అత్తార్ ఇబ్రహీం కొడుకు. పుల్వామాలో ఆత్మాహుతి బాంబుదాడికి పాల్పడి, 40కి మందికి పైగా జవాన్లను బలి తీసుకున్న ఆదిల్ అహ్మద్‌ను ఆ పనికి పురికొల్పిందీ, సూసైడ్ బాంబర్‌గా తయారుచేసిందీ ఉమైర్ అని అంతర్గత వర్గాలు తెలిపాయి.

ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసే క్రమంలో ఆదిల్‌ను ఉమైర్ కొన్ని నెలల నుంచీ తన కుటుంబాన్ని కానీ, స్నేహితుల్ని కానీ కలుసుకోవడానికి అనుమతించకుండా అతడికి బ్రైన్‌వాష్ చేసి, ఆత్మాహుతికి పురికొల్పాడనీ ఆ వర్గాలు చెబుతున్నాయి.

అందువల్లే ఆదిల్ సూసైడ్ బాంబర్‌గా తయారవుతున్న విషయం అతని తల్లిదండ్రులకు కానీ, సన్నిహితులకు కానీ తెలియదని అవి అంటున్నాయి. తన కొడుకును చూసి కొన్ని నెలలైపోయిందని ఆదిల్ తల్లి ఫమీదా తెలిపింది.