Mohan Lal’s Randamoozham Gets A New Producer


Mohan Lal's Randamoozham Gets A New Producer
Mohan Lal’s Randamoozham Gets A New Producer

‘రండమూళం’కు కొత్త నిర్మాత!

గత ఏడాది మెగా బడ్జెట్ సినిమా ‘రండమూళం’ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రఖ్యాత మలయాళీ రచయిత ఎం.టి. వాసుదేవన్ నాయర్ ప్రకటించడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సినిమాకు ఆయనే కథకుడు, స్క్రీన్‌ప్లే రచయిత. ‘రండమూళం’ నాయర్ స్వీయ నవల. భీముని దృష్టి నుంచి రాసిన మహాభారత రచన. 1984లో ప్రచురితమైన ఆ నవల ఎంతో ప్రసిద్ది చెందింది. దాని ఆధారంగా డైరెక్టర్ వీఏ శ్రీకుమార్ మీనన్ ఓ చిత్రాన్ని తలపెట్టాడు. ప్రధాన పాత్రకు మోహన్‌లాల్‌ను ఎంచుకున్నాడు. ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో బహుళ భాషా చిత్రంగా దీన్ని రూపొందించనున్నామని శ్రీకుమార్ మీనన్ ప్రకటించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి వాసుదేవన్ నాయర్ మాత్రమే కాకుండా నిర్మాత బీఆర్ శెట్టి సైతం తప్పుకోవడంతో ‘రండమూళం’ ప్రాజెక్ట్ అటకెక్కినట్లేనని అంతా భావించారు. ఈలోగా మోహన్‌లాల్‌తో శ్రీకుమార్ మీనన్ ‘ఒడియన్’ సినిమాని రూపొందించాడు. అది కాస్తా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

స్పందించని మోహన్‌లాల్

ఈ నేపథ్యంలో ‘రండమూళం’ను నిర్మించేందుకు ఒక కొత్త నిర్మాత తెరపైకి వచ్చారు. ఆయన పేరు డాక్టర్ ఎస్.కె. నారాయణన్. శ్రీకుమార్ మీనన్‌తో కాంట్రాక్టుపై డాక్టర్ నారాయణన్ సంతకం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రస్తుతం ‘రండమూళం’ ప్రి ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. జూలైలో షూటింగ్ మొదలవుతుందని చెప్పుకుంటున్నారు. కాగా వాసుదేవన్ నాయర్, బీఆర్ శెట్టి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాక మోహన్‌లాల్ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా రాకపోవడం గమనార్హం. ‘ఒడియన్’ బాక్సాఫీస్ ఫలితం తర్వాత శ్రీకుమార్ మీనన్ డైరెక్షన్‌పై ఆయన అసంతృప్తితో ఉన్నారని వినిపిస్తోంది. ‘రండమూళం’పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.