‘గ్యాంగ్ లీడర్’గా నాని!


'గ్యాంగ్ లీడర్'గా నాని!

అవును. నాని సరికొత్త ‘గ్యాంగ్ లీడర్’గా కనిపించబోతున్నాడు. విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ఖరారు చేశారు. తన పుట్టినరోజు (ఫిబ్రవరి 24) సందర్భంగా ఆదివారం సాయంత్రం ఈ టైటిల్‌ను తన ట్విట్టర్ పేజీ ద్వారా నాని స్వయంగా ప్రకటించాడు.

‘గ్యాంగ్ లీడర్’ (1991) టైటిల్‌తో చిరంజీవి నటించిన సినిమా ఆ రోజుల్లో రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో చిరంజీవి, విజయశాంతి జోడీ ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది. బప్పీ లహిరి స్వరాలు కూర్చిన అందులోని పాటలన్నీ సూపర్‌హిట్టే. ముఖ్యంగా ‘వానా వానా వెల్లువాయే’, ‘భద్రాచలం కొండా’ పాటలు జనం నోట చాలా కాలం నానాయి.

ఇప్పుడు ఆ టైటిల్‌తో సినిమా చేయడానికి ధైర్యం చేస్తున్నాడు నాని. తను పిల్లాడిగా ఉన్నప్పుడు చేతిలో గన్ను, చిరు గడ్డంతో చిరంజీవి చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా తొలిరోజు తోలి ఆట చూసిన రోజు ఇప్పటికీ తనకు గుర్తేననీ, తర్వాత జరిగింది ఒక చరిత్ర అనీ ట్వీట్ చేశాడు నాని. ఒక ప్రౌండ్ ఫ్యాన్‌గా ఆ టైటిల్‌ను ప్రకటిస్తున్నానని పోస్ట్ చేశాడు.

కార్తికేయ, ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిల్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.