ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంతు!


ఇక 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వంతు!

ప్రస్తుతం తెలుగునాట బయోపిక్‌ల పరంపర నడుస్తోన్న విషయం తెలిసిందే. సావిత్రి జీవితంపై వచ్చిన ‘మహానటి’ ఘన విజయం సాధించాక బయోపిక్‌లనేవి తెలుగునాట ఎన్నడూ లేని విధంగా ఒక ట్రెండ్‌గా మారాయి. ఇప్పటికే ఎన్టీఆర్ సినీ జీవితం, పాక్షిక రాజకీయ జీవితంపై రెండు సినిమాలు ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ వచ్చాయి.

అదే విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంతో ఆయనపై ‘యాత్ర’ సినిమా వచ్చింది. అయితే ఈ మూడు సినిమాలూ ప్రేక్షకులను అలరించలేకపోయాయని వసూళ్లు తెలియజేస్తున్నాయి.

ఇక తదుపరి వంతు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగు పెట్టినప్పట్నుంచీ, ఆయన చివరి క్షణాల దాకా జరిగిన ఘటనల ఆధారంగా లక్ష్మీ పార్వతి దృష్టికోణం నుంచి రాంగోపాల్ వర్మ ఈ సినిమాని రూపొందించారు.

మొదట్నుంచీ ఆయన క్రిష్ డైరెక్ట్ చేసిన ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ చిత్రాలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ వచ్చారు. ‘రియాలిటీ’ ఒకటైతే, క్రిష్ సినిమాల్లో దానికి విరుద్ధంగా చూపారంటూ ట్విట్టర్ వేదికగా అస్త్రాలు సంధించారు.

నిజ జీవితంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, ‘మహానాయకుడు’లో అసలా ఘటనకు చోటు లేకుండా చేసి, ఎన్టీఆర్ పార్టీకి రక్షకుడిగా చంద్రబాబును చూపారంటూ ఎద్దేవా చేశారు.

ఇక 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వంతు!

ఈ నేపథ్యంలో వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది? ప్రేక్షకులు దాన్ని ఎలా ఆదరిస్తారు? అసలు ఆదరిస్తారా? లేక ఆ సినిమానీ తిరస్కరిస్తారా? అనే ఆసక్తికర చర్చ సినీప్రియుల మధ్య నడుస్తోంది.

వర్మ తీసిన సినిమాలో స్టార్లు లేరు. రంగస్థల నటులతో, ప్రేక్షకుల్లో ఏమాత్రం పాపులారిటీ లేని నటులతో ఆ సినిమా తీశారు. మహా మహా నటులతో తీసిన బయోపిక్‌లే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా, ప్రేక్షకులకు ముక్కూ మొహం తెలీని నటులతో తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆడుతుందా? అనేది ఒక ప్రశ్న.

ఇప్పటికీ తన సినిమాను ఎప్పుడు విడుదల చేసేదీ వర్మ వెల్లడించలేదు. మార్చిలో, లేదా ఏప్రిల్‌లో విడుదల చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు బ్రేక్ పడే అవకాశాలున్నాయి.

ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపకుడు కాబట్టి ఒక రాజకీయ నాయకుడి బయోపిక్ విడుదలకు ఎన్నికల కమిషన్ అంగీకరించే అవకాశాలుండవు. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్ కంటే ముందుగానే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి. అందుకు తగిన ఏర్పాట్లను వర్మ చేస్తున్నాడో, లేదో చూడాలి.