NTR Mahanayakudu Review: 5 Ups And 3 Downs


NTR Mahanayakudu Review: 5 Ups And 3 Downs
Balakrishna as NTR Mahanayakudu

‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ రివ్యూ: ఐదడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి

దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి

తారాగణం: నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, రానా దగ్గుబాటి, సచిన్ ఖడేకర్, కల్యాణ్‌రామ్, వెన్నెల కిశోర్, భరత్‌రెడ్డి, పూనమ్ బజ్వా, మంజిమా మోహన్, సుప్రియా వినోద్, దగ్గుబాటి రాజా, సమీర్

విడుదల తేది: 22 ఫిబ్రవరి 2019

తెలుగువాళ్ల ఆత్మగౌరవంగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన నందమూరి తారకరామారావు అలియాస్ ఎన్టీఆర్ జీవితంలోని సినీ ప్రయాణం జనవరి 9న ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ పేరిట వచ్చింది. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితాన్ని ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్. అయితే ఇది ఎన్టీఆర్ సంపూర్ణ ప్రయాణం కాదు, పాక్షిక ప్రయాణమే.

కథ

తొలి భాగం ‘కథానాయకుడు’ను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించడంతో ముగించారు. అక్కడి నుంచి ‘మహానాయకుడు’ కథను ప్రారంభించాడు దర్శకుడు. పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే 202 సీట్లు గెలుపొందండం ద్వారా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారు ఎన్టీఆర్.

ఆయన తర్వాత పార్టీలో తానే నంబర్ 2 అని నాదెండ్ల భాస్కరరావు ప్రకటించుకున్నారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు చంద్రగిరి నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇక రాజకీయాల నుంచి తప్పుకొని వ్యాపార రంగంలో కొనసాగాలనుకొని విష్ణుప్రియ హోటల్స్ పెట్టారు.

అయితే ఎన్టీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించి సభ్యుడిని చేశారు. ఎన్టీఆర్ భార్య బసవతారకంకు కేన్సర్ అనీ, ఫోర్త్ స్టేజ్‌లో ఉందనీ నిర్ధారణ అయ్యింది. ఈ వార్త విని ఆయనకు రెండోసారి గుండెపోటు వచ్చింది.

కుటుంబ సభ్యుల సలహామేరకు భార్యను తీసుకొని చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు ఎన్టీఆర్. అప్పటికే ఆయన ముక్కుసూటి ప్రవర్తన, నిజాయితీ, నిబద్ధతతో కూడిన పాలనతో నాదెండ్ల భాస్కరరావుతో పాటు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు.

దీన్ని నాదెండ్ల తనకు అనుకూలంగా మలచుకొని వారిని తనవేపు తిప్పుకున్నారు. జరుగుతున్న తతంగాన్ని చంద్రబాబు గ్రహించారు. ఎన్టీఆర్‌కూ, పార్టీకీ విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలను ఒక తాటికిందకు తెచ్చారు. చికిత్స తర్వాత ఎన్టీఆర్ దంపతులు హైదరాబాద్ వచ్చేశారు.

ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆశీస్సులు, రాష్ట్ర గవర్నల్ రాంలాల్ సహకారంతో మెజారిటీ ఎమ్మెల్యేలు తనవెంటే ఉన్నారని దొంగ లెక్కలు చూపించి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించారు నాదెండ్ల. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రజల వద్దకు వెళ్లి తెలుగువాళ్ల ఆత్మగౌరవానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన ఎన్టీఆర్ వాళ్ల మద్దతును పొంది, తద్వారా తిరుగులేని ప్రజాబలంతో ఢిలీ పీఠాన్ని కదిలించి, నాదెండ్లను పదవీచ్యుతుడిని ఎలా చేశారో, మళ్లీ ముఖ్యమంత్రిగా ఎలా గద్దెనెక్కారో మిగతా కథగా మనం చూడొచ్చు.

NTR Mahanayakudu Review: 5 Ups And 3 Downs

కథనం

తొలి భాగం గ్లామర్‌తో నిండి, ఎన్టీఆర్ ధరించిన పాత్రల పోషణ, భార్య బసవతారకంతో ఆయన అనుబంధం కనిపిస్తే, ఈ రెండో భాగం రాజకీయాలతో నిండి పూర్తి సీరియస్ సినిమాగా మన ముందుకు వచ్చింది.

పార్టీ జెండాను రూపకల్పన చేయడం దగ్గర్నుంచి, జనంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎప్పుడో 1983 ఆగస్టులో జరగాల్సిన ఎన్నికల్ని జనవరిలోనే ఇందిరా గాంధీ పెట్టిస్తే, ఆమె ఊహల్నీ, ఆశల్నీ కాలరాసి, తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అధికారంలోకి తెచ్చిన వైనాన్ని భావోద్వేగపూరిత పాటలతో దర్శకుడు చిత్రించిన వైనం ఆకట్టుకుంటుంది.

తనను ఎవరైతే ముఖ్యమంత్రిని చేసి, రాష్ట్రానికీ, తమకూ సేవచేసే అవకాశం కల్పించారో, ఆ జనాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అహర్నిశలూ కష్టపడ్డారనీ, నిద్రాహారాలను సైతం అందులో భాగంగా చేసుకున్నారనీ క్రిష్‌లోని దర్శకుడు, కథకుడు చిత్రించాడు. అందుకోసమే ఆయన కాషాయ వస్త్రాలు ధరించారని చూపించాడు.

జన సంక్షేమ లక్ష్యానికి ఒక్కడు నిబద్ధతతో ఉంటే చాలదు, అందుకు అతని సహచరులూ కట్టుబడి ఉండాలి. ఎన్టీఆర్ ప్రజాకర్షణ శక్తిని గుర్తించి, ఆయన వైపు నిల్చున్న నాదెండ్ల ఉద్దేశం వేరనీ, ఎన్టీఆర్‌ను అడ్డం పెట్టుకొని అధికారాన్ని చలాయించాలని ఆయన చూశారనే కోణంలో ఆయన పాత్రను మలిచాడు దర్శకుడు. పూర్తిగా నాదెండ్లను విలన్ తరహాలో చిత్రించాడు.

అదే సమయంలో చిన్నల్లుడు చంద్రబాబునాయుడును ఈ సినిమాలో సెకండ్ హీరోగా తీర్చిదిద్దాడు.

ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి పాలైన చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ అనుమానంతోనే చూసిందనీ, ఎప్పుడు పార్టీ మారుతున్నావంటూ కాంగ్రెస్ నాయకులు ఆయనను తరచూ అడుగుతుండటంతో ఆయన రాజకీయాలు విసర్జించి వ్యాపార రంగంలోకి వెళ్లాలని భావించారనీ, అయితే ఎన్టీఆర్ ఆహ్వానించడంతో టీడీపీలోకి వచ్చారనీ క్రిష్ చిత్రించాడు.

ఇది వాస్తవ విరుద్ధంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. పార్టీలోకి రావాలని ముందుగా ఎన్టీఆర్ కోరలేదనీ, భార్య భువనేశ్వరితో చంద్రబాబు పావులు కదిపి, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారనీ చెబ్తున్నారు.

చదువుకొనే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా రాజకీయాలను వంటబట్టించుకున్న చంద్రబాబు, చిన్న వయసులోనే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి, 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయిన చంద్రబాబు, ఐదేళ్ల తర్వాత ఒక్కసారి ఓడిపోవడంతోనే రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఆలోచన చేశారని చూపడం సబబుగా లేదు. చంద్రబాబును పూర్తిగా పాజిటివ్ కోణంలో చూపించడంలో భాగంగా దీన్ని అర్థం చేసుకోవాలి.

నాదెండ్ల వల్ల ఎన్టీఆర్ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఆయనను తిరిగి ముఖ్యమంత్రిగా చేయడంలో చంద్రబాబే కీలకంగా వ్యవహరించారని, ఆయనను హీరోయిక్‌గా చిత్రించాడు క్రిష్. ఈ క్రమంలో ఎన్టీఆర్ కొడుకుల్లో ఒక్క హరికృష్ణ మాత్రమే చైతన్య రథసారథిగా కొంత అస్తిత్వాన్ని కాపాడుకోగా, బాలకృష్ణ సహా మిగతా కొడుకుల్లో ఏ ఒక్కరూ తమ అస్తిత్వాన్ని ప్రదర్శించినట్లు కనిపించలేదు.

అన్న సినీ రంగంలో ఉన్నతకాలం ఆయన నీడలా వెన్నంటే ఉండి, ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టంలేక దూరం జరిగిన త్రివిక్రమరావు, అన్నకు ఎదురైన పరాభవాన్నీ, అవమానాన్నీ తట్టుకోలేక, తిరిగి అన్న వద్దకు వచ్చినట్లు చూపించడం బాగుంది.

NTR Mahanayakudu Review: 5 Ups And 3 Downs

ఎన్టీఆర్‌ను ఎలాగైనా పదవీచ్యుతుడ్ని చేయాలనే పట్టుదలను అప్పట్లో ఇందిరా గాంధీ ప్రదర్శించారనేది నిజమే. అందువల్ల సహజంగానే ఆమె కూడా ఈ సినిమాలో నెగటివ్ కోణంలోనే దర్శనమిచ్చారు. కాకపోతే ఒక సినీ నటుడిగా భావించి చిన్నచూపు చూసిన ఆమె, ఆయనను జనహృదయ నాయకుడిగా గుర్తించినట్లు చివర్లో చూపించి, ఆమె పాత్రలోని నెగటివిటీని తగ్గించాడు దర్శకుడు.

ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆమె కారులో వెళ్తూ కృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ కటౌట్‌కు “జై శ్రీకృష్ణ్” అని చేతులెత్తి నమస్కరించడం, “ఆయన శ్రీకృష్ణుడు కాదు, ఆయన వేషంలో ఉన్న రామారావు” అని ఆమె పక్కనే కూర్చున్న పీవీ నరసింహారావు చెప్పడం, దానికి ఆమె ఆలోచనలో పడినట్లు చూపించడం దర్శకుడిగా క్రిష్ తీసుకున్న స్వేచ్ఛ.

ఎన్టీఆర్‌ని జనం దేవుడిగా ఎలా కొలుస్తారో ఇందిరకు ఆ ఘటనతో అవగతమయినట్లు చూపించడం దర్శకుడి ఊహా చాతుర్యమే.

అయితే శ్రీకృష్ణుడిగా కటౌట్‌లో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న బాలకృష్ణను చూపించకుండా ఎన్టీఆర్‌ని చూపించడం సినీ ప్రాథమిక సూత్రాల ప్రకారం పొరపాటు. నిజ జీవితంలోని పాత్రల్ని తెరపై ఎవరు పోషిస్తున్నారో, అన్ని సందర్భాల్లోనూ ఆ నటుడినే ఆ పాత్రలో చూపించాలి.

మొదటి భాగంలో రామారావు, బసవతారకం దంపతుల మధ్య అనుబంధానికి పెద్దపీట వేసిన దర్శకుడు ఈ సినిమాలోనూ దాన్ని కొనసాగించాడు. వాళ్లిద్దరి అనుబంధాన్ని హృదయానికి హత్తుకొనేలా చిత్రించాడు. సినిమాని ఆకర్షవంతం చేసిన అంశాల్లో ఇది ఒకటి.

రాజకీయంగా ఎన్టీఆర్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, ఓదార్పే కాదు, ఆశయ సాధనకు కావాల్సిన స్థైర్యం సైతం ఆమె సమక్షం వల్ల లభించేదని చూపించడంతో బసవతారకం అసలుసిసలు నాయికగా ఈ సినిమాలో మరోసారి మనముందు ప్రత్యక్షమవుతుంది.

కేన్సర్‌ను చిరునవ్వుతోటే ఎదుర్కొన్నదని చూపించడంలో ఎంత వాస్తవముందో మనకు తెలియదు కానీ, ఆ సన్నివేశాలు మనసుని తడి చేస్తాయి. చివరకు తన బావ (ఎన్టీఆర్) చేతుల్లోనే ఆమె ఈ లోకాన్ని వీడి వెళ్లిందని చూపించి, హృదయాల్ని భారంచేసి చిత్రాన్ని ముగించాడు దర్శకుడు.

NTR Mahanayakudu Review: 5 Ups And 3 Downs

తారల అభినయం

‘తెలుగువారి ఆత్మగౌరవం’ ఎన్టీఆర్‌గా బాలకృష్ణ తొలి భాగంలో కంటే మలి భాగంలో మరింత ఉన్నత స్థాయిలో రాణించారు. చైతన్య రథంపై తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ హుషారుగా కనిపించిన ఆయన, రాజకీయ సంక్షోభ ఘట్టాల్లో ఆవేశాన్ని ప్రదర్శించే సన్నివేశాల్లోనూ, ఆవేశాన్ని అణచుకోవాల్సిన సందర్భాల్లోనూ ప్రదర్శించిన హావభావాలు గొప్ప నటుడి స్థాయిలో ఉన్నాయి.

ముఖ్యంగా అసెంబ్లీ సన్నివేశాల్లో ఒక్క మాటా మాట్లాడకుండా చూపించిన నటన ఈ సినిమాకే హైలైట్. ఇక బసవతారకం వద్ద శాంతమూర్తిగా, ఆమె మనసెరిగిన జీవిత భాగస్వామిగా గొప్పగా రాణించారు బాలయ్య. ఆయన నట జీవితంలో ‘మహానాయకుడు’ ఒక కలికితురాయి.

బాలకృష్ణ తర్వాత చెప్పుకోవాల్సింది విద్యా బాలన్‌నే. తొలి భాగంలో ఆమె మనల్ని ఆహ్లాదకర సన్నివేశాలతో అలరించింది. ఈ సినిమాలో భిన్నమైన సన్నివేశాలతో మన హృదయాల్ని తడి చేస్తుంది. కేన్సర్‌తో బలహీనపడ్డ బసవతారకం రూపంతో విద్య ప్రదర్శించిన నటన అత్యుత్తమం.

అమెరికాలో హాస్పిటల్లో కేన్సర్‌తో పోరాడుతూ హాస్పిటల్ బెడ్‌పైనే ఉండి హార్మోనియం వాయిస్తూ పాటపాడే సన్నివేశం ఒక వైపు ముచ్చటగా అనిపిస్తూ, మరోవైపు గుండెల్ని మెలిపెడుతుంది (నిజానికి హాస్పిటల్లో కేన్సర్ పేషెంట్ దగ్గరకు హార్మోనియం పెట్టెను అనుమతిస్తారా అనేది వేరే విషయం).

నాదెండ్ల భాస్కరరావుగా సచిన్ ఖడేకర్ రాణించారు. మొదట తేనె పూసిన కత్తె తరహా మనస్తత్వంతోనూ, తర్వాత తనేమిటో బయటపడి దుష్టత్వాన్ని ప్రదర్శించడంలోనూ సచిన్ చక్కని నటన చూపించారు.

ఇక సెకండ్ హీరోలాంటి చంద్రబాబు పాత్రలో రానా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. హావభావాలు పైకి తెలీకుండా, గంభీరంగా కనిపిస్తూ పనులు చక్కబెట్టే ఆ పాత్రలో అత్యుత్తమ స్థాయిలో రాణించాడు రానా. అయితే రానా నిల్చొనే పద్ధతిపై దర్శకుడి కాస్త ఏమరపాటు చూపించాల్సింది.

ఎందుకంటే సాధారణంగా చంద్రబాబు నిటారుగా నిల్చుని కనిపిస్తారు. దానికి భిన్నంగా రానా ఒక పక్కకు ఒరిగినట్లు నిల్చొని కనిపించడం అతకలేదు.

ప్రధాని ఇందిరా గాంధీ పాత్రకు ముంబై తార సుప్రియా వినోద్ న్యాయం చేశారు. ఇదివరకే మధుర్ భండార్కర్ సినిమా ‘ఇందు సర్కార్’లో అదే పాత్రను చేసి ప్రశంసలు పొందిన ఆమెకు మరోసారి ఆ పాత్ర పోషణ నల్లేరుపై బండి నడక.

హరికృష్ణగా కల్యాణ్‌రామ్, రుక్మాంగదరావుగా వెన్నెల కిశోర్, మిగతా పాత్రధారులు తమ పరిధుల మేరకు నటించారు.

దర్శకత్వం, సంగీతం

బయోపిక్ అనేది కత్తి మీద సాము అయితే తెలుగువారి గుండెల్లో గూడుకట్టుకొన్న అసామాన్య నాయకుడి కథను తెరపై చూపించడం మరింత క్లిష్టమైన కార్యం. పైగా ఎన్టీఆర్ గురించి తెలిసినవారికీ, ఆయనతో అనుబంధం ఉన్నవారికీ, సన్నిహితులకీ, ఆ కాలం మనుషులకీ, అప్పటి స్థితిగతులు, జరిగిన ఘటనలూ తెలుసు.

మన ఇష్టం వచ్చినట్లు, మనకు తెలిసినట్లు, మనకు నచ్చినట్లు బయోపిక్ తీద్దామనుకుంటే కుదరదు. ఎంత నాటకీయత జోడించినా వాస్తవ విరుద్ధంగా ఘటనలు ఉంటే అది చరిత్రకు ద్రోహం చేసినట్లు అవుతుంది. ఈ విషయం క్రిష్‌కు బాగా తెలుసు.

అందుకని వాస్తవ ఘటనలకు నాటకీయతను జోడించి ఈ సినిమాని రూపొందించేందుకు కృషి చేశాడు. ఎంతటి దర్శకుడికైనా ఉన్నదున్నట్లు చూపించలేడు. కొంత స్వేచ్ఛ తీసుకుంటాడు. ఆ మేరకు ‘మహానాయకుడు’లో స్వేచ్ఛ తీసుకున్నాడు.

అయినప్పటికీ చంద్రబాబు, ఇందిరా గాంధీ పాత్రల్ని చిత్రించిన తీరు చాలా మందికి రుచించవు. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన పాత్రను మలిచినట్లు ఎవరికైనా అనిపిస్తే అది వారి తప్పు కాదు. ఎందుకంటే ఆ పాత్ర తీరు అలాగే ఉంది మరి.

ఒకసారి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (భరత్‌రెడ్డి)తో “చెప్పేటోళ్లుండాలి. లేకపోతే ఆరు కోట్లమంది ఆయన పక్కనున్నా ఒంటరోడైపోతాడు” అని చంద్రబాబు (రానా) చెప్తాడు. అంటే ఎన్టీఆర్‌కు చెప్పేవోడు చంద్రబాబు అని చూపించాడన్న మాట క్రిష్.

ఆ విషయం పక్కనబెడితే సినిమాని ఒక టెంపోలో నడిపించే విషయంలో అతను సక్సెసయ్యాడు. ఎన్టీఆర్‌ కేరెక్టర్‌ని ఎమోషనల్‌గా మలచడంతో క్రిష్ ప్రతిభ తెలుస్తుంది.

క్రిష్ తీసిన సన్నివేశాలకు జీవం పోసింది ఎం.ఎం. కీరవాణి సంగీతం. ఎన్నికల కోసం ఎన్టీఆర్ సమాయత్తమయ్యే విధానానికి పాటలే ఉద్వేగాన్నిచ్చాయి. సినిమాలో సన్నివేశాల బలం తగ్గినా కూడా సంగీత బలం తగ్గలేదు. అది కీరవాణి సంగీతానికున్న బలం.

చివరి మాట

ఇది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్. ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి జారనీయకూడదనే లక్ష్యంలో భాగంగా, తెలుగువాళ్ల హృదయాల్లో నిలిచిన నందమూరి తారకరామారావును బతికించి, మరోసారి ఆయనను తురుపుముక్కగా ఉపయోగించి లాభపడాలనే ఉద్దేశంతో తీసిన సినిమా అనే అభిప్రాయం కలిగించే సినిమా.

– బుద్ధి యజ్ఞమూర్తి