NTR Mahanayakudu: Theatrical Rights Allotted To Kathanayakudu Distributors


NTR Mahanayakudu: Theatrical Rights Allotted To Kathanayakudu Distributors
NTR Mahanayakudu

‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ థియేటర్ హక్కులు వాళ్లకే!

ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగమైన ‘మహానాయకుడు’ను ఫిబ్రవరి 22న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. తొలి భాగం ‘కథానాయకుడు’ ఎన్నో అంచనాలతో జనవరి 9న విడుదలై ప్రేక్షకుల్ని అలరించడంలో ఫెయిలైన సంగతి తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ విలువ రూ. 71 కోట్లయితే వసూలయ్యింది రూ. 20.6 కోట్లు (షేర్) మాత్రమే! అంటే  70 శాతం పైగా నష్టాలు చవిచూశారు బయ్యర్లు. ఇది ఎన్టీఆర్ అభిమానుల ఊహకు ఏమాత్రం అందని విషయం.

విషయానికి వస్తే ‘మహానాయకుడు’ హక్కులను ‘కథానాయకుడు’ బయ్యర్లకే ఉచితంగా ఇవ్వాలని నిర్మాతలు బాలకృష్ణ, విష్ణు ఇందూరి నిర్ణయించారు. ఇది బయ్యర్లకు ఊరటనిచ్చే విషయం. షేర్ ఎంత వస్తే అంత మునుపటి సినిమా నష్టాలను ఆ మేరకు పూరిస్తుంది. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు.

కాగా ‘మహానాయకుడు’ సినిమా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని, ఆ జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లనూ, ఘన విజయాలనూ, నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్‌నూ ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నది.

‘కథానాయకుడు’కు బాక్సాఫీస్ వద్ద ఎదురైన ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ‘మహానాయకుడు’ను ఒక సవాలు తీసుకున్న దర్శకుడు క్రిష్ చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేసి, మరింత పకడ్బందీగా స్క్రిప్ట్‌ను రూపొందించి పూర్తి చేశాడని అంతర్గత వర్గాల సమాచారం.

ఏదేమైనా మరో 9 రోజుల్లో ‘మహానాయకుడు’ బాక్సాఫీస్ వద్ద చెలరేగుతాడో, లేదో తేలిపోనున్నది.