Rajinikanth Movie Under Murugadoss Direction To Go On Floors In March


Rajinikanth Movie Under Murugadoss Direction To Go On Floors In March

మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనున్న రజనీ-మురుగదాస్ సినిమా

‘పేట’ ఇంకా విజయవంతంగా థియేటర్లలో ఆడుతుండగానే, తన తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. అధికారికంగా నిర్మాతలు ప్రకటించకపోయినా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ఆయన నటించనున్నాడు.

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మార్చిలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఈ సినిమాకు పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఎన్నో ఏళ్ల నుంచీ రజనీని డైరెక్ట్ చెయ్యాలని కలలు కంటూ వస్తున్నాడు మురుగదాస్. ఇన్నాళ్లకు ఆయన కల ఫలిస్తోంది.

గత రెండేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న రజనీ సూపర్ ఫాంలో ఉన్నాడు. ‘కబాలి’, ‘కాలా’, ‘పేట’ సినిమాలు హిట్ కాగా, ‘2.0’ హిందీలో సూపర్ హిట్టయింది. ఇంతకుముందు ‘నర్కలి’ అనే రాజకీయ చిత్రాన్ని మురుగదాస్‌తో రజనీ చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. దాన్ని మురుగదాస్ ఖండించాడు. రజనీతో తాను తీయబోయే సినిమా అన్ని వర్గాలనూ అలరించే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపాడు.

రజనీకాంత్ ఇలా ఆగకుండా వరసబెట్టి సినిమాలు చేస్తుండటంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని అభిమానులు ఆత్రుతపడుతున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని 2018లో రజనీ ప్రకటించాడు. అయితే ఇంతవరకు మళ్లీ దానికి సంబంధించి ఎలాంటి ప్రకటనా ఆయన నుంచి లేదు.