Rao Ramesh As KVP: Impressive Movie Transformation

‘యాత్ర’: కేవీపీగా మారిన రావు రమేశ్
మహి వి. రాఘవ్ రూపొందించిన ‘యాత్ర’ సినిమాలో వైఎస్ రాజశేఖరరెడ్డిగా మమ్ముట్టి ప్రదర్శించిన అభినయం తర్వాత చెప్పుకోవాల్సింది రావు రమేశ్ నటనను. ఆయన ఈ సినిమాలో వైఎస్సార్ ‘ఆత్మ’గా పేరుపొందిన ఆయన ప్రాణ స్నేహితుడు కె.వి.పి. రామచంద్రరావు పాత్రను పోషించారు. ఆ పాత్రలో చక్కగా ఇమిడిపోయారు.
మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో వైఎస్సార్‌కు కేవీపీ జూనియర్ అయినప్పటికీ వాళ్ల స్నేహానికి అది అడ్డు కాలేదు. ఆ రోజుల్లో కేవీపీ ‘క్యాప్స్టన్’ బ్రాండ్ సిగరెట్లు తాగేవారు. అందుకే తర్వాత కాలంలో కేవీపీని వైఎస్సార్ ‘క్యాప్స్టన్’ అంటూ సంబోధిస్తూ వచ్చారు. ‘యాత్ర’ సినిమాలో కేవీపీని వైఎస్సార్ ప్రతిసారీ అలాగే సంబోధిస్తూ కనిపిస్తారు.
అలాగే వైఎస్‌ను ఈ సినిమాలో ‘రాజా’ అని సంబోధిస్తూ కనిపిస్తారు కేవీపీ. సినిమాలోని అనేకానేక సన్నివేశాల్లో వైఎస్‌కు సలహాలు, సూచనలు ఇస్తూ కేవీపీ పాత్ర మనకు దర్శనమిస్తుంది. అఢిష్టానం నుంచి ఆంధ్రా పరిశీలకుడిగా వచ్చిన కాంగ్రెస్ నాయకుడితో ఫోన్లో కేవీపీగా మాట్లాడే తీరు, ఆ విషయాన్ని వైఎస్సార్‌కు చెప్పే తీరులో రావు రమేశ్ ఎంత సెటిల్డ్‌గా హావభావాలు ప్రదర్శించారో పరిశీలనగా చూస్తే అర్థమవుతుంది.
స్వతహాగా కేవీపీ అంతర్ముఖుడు. ఎక్స్‌ప్రెసివ్ కాదు. ఆయన మనసులో ఎలాంటి భావాలు చెలరేగుతున్నాయో ఆయన ముఖాన్ని బట్టి అంచనా వేయడం కష్టం. ఆ విషయాన్ని అర్థం చేసుకొని చాలా సన్నివేశాల్లో నిర్వికారంగా కనిపించారు రావు రమేశ్. ఆ పాత్రను ఎంతో ఆకళింపు చేసుకుంటే తప్ప అలా నటించలేరు.
తెరపై వైఎస్సార్, కేవీపీలుగా మమ్ముట్టి, రావు రమేశ్ గొప్పగా రాణించారు. రావు గోపాలరావుగారి అబ్బాయిలోని నటుడు మరోసారి ఉన్నత స్థాయిలో మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన సదర్భం ఇది.
