Rumours Rampant On Jr NTR’s Political Entry


Rumours Rampant On Jr NTR's Political Entry
Jr NTR

జగన్‌ను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ మామ.. వెల్లువెత్తిన వదంతులు!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు (లక్ష్మీప్రణతి తండ్రి) కలవడంతో జూనీర్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ తెలుగు రాష్ట్రాల్లో వదంతులు వ్యాపిస్తున్నాయి. ఏ రకంగా చూసినా జగన్‌ను జూనియర్ ఎన్టీఆర్ మామ కలవడం చర్చనీయాంశమే.

ఇప్పటికే పలుమార్లు తాను తెలుగుదేశం పార్టీకే మద్దతునిస్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశాడు కానీ చాలా కాలంగా రాజకీయాలకు దూరం పాటిస్తూ వస్తున్నాడు.

గత తెలంగాణ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజక వర్గంలో పార్టీ తరపున పోటీ చేసిన సోదరి సుహాసినికి కల్యాణ్‌రాంతో పాటు తనూ మద్దతు తెలిపి, ఆమెకు ఓటు వేయమంటూ అభిమానులకూ, టీడీపీ శ్రేణులకూ పిలుపునిచ్చాడు. అయితే నియోజక వర్గంలో ప్రచారానికి మాత్రం దూరంగా ఉన్నాడు. బాలకృష్ణ ఒక్కడే అన్న కూతురి తరపున ప్రచారం నిర్వహించాడు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడితో జూనియర్ ఎన్టీఆర్‌కు చాలా కాలంగా సఖ్యత లేదనే మాట వినిపిస్తూ వస్తోంది. అయినప్పటికీ తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కాబట్టి టీడీపీని తన పార్టీగానే భావిస్తూ వస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఒక వ్యాపారవేత్త. ఆయనకు రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారాలున్నాయి. సమీపంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జగన్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం శ్రీనివాసరావు కలవడంతో అనేక సందేహాలకు తావిచ్చింది.

వైఎస్సార్సీపీలో శ్రీనివాసరావు చేరబోతున్నారా? లేక ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఉంటుందని చెప్పడానికి వెళ్లారా?.. అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయితే తాను మర్యాద పూర్వకంగా జగన్‌ను కలిశానని శ్రీనివాసరావు చెప్తున్నారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో కలవడం కచ్చితంగా ఏదో జరుగుతోందనే ఊహలకు ఆస్కారమిచ్చినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్‌తో పాటు హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాలే తన ప్రాధాన్యం అని చెప్పిన అతను ఇప్పట్లో రాజకీయాల్లోకి రావడం జరగదనేది చాలామంది అభిప్రాయం.