Saare Jahaan Se Accha: Vicky Kaushal To Replace Shahrukh Khan!

రాకేశ్ శర్మ పాత్రలో విక్కీ!
చూస్తుంటే రాకేశ్ శర్మ బయోపిక్ ‘సారే జహా సే అచ్ఛా’ సినిమాలో షారుఖ్ ఖాన్ నటించేట్లు కనిపించడం లేదు. మహేశ్ మథై డైరెక్ట్ చేసే ఈ సినిమాలో రాకేశ్ శర్మ పాత్రను బాలీవుడ్ తాజా సంచలనం విక్కీ కౌశల్ పోషించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఫరాన్ అఖ్తర్ సినిమా ‘డాన్ 3’ని మొదట పూర్తి చెయ్యాలని షారుఖ్ నిర్ణయించుకోవడమే దీనికి కారణమంటున్నారు. దీంతో ‘ఉరీ: ద సర్జికల్ స్ట్రైక్’తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన విక్కీ వైపు మహేశ్ మథై దృష్టి పడింది. 1984లో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లిన భారత వ్యోమగామిగా చరిత్ర పుటల్లో నిలిచిన రాకేశ్ శర్మ పాత్రకు విక్కీని సంప్రదించాడు.
విక్కీ సైతం ఆనందంగా అంగీకరించాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విక్కీ ప్రస్తుతం కొత్త దర్శకుడు భానుప్రతాప్ సింగ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు. ధర్మా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఇది అతనికి తొలి హారర్ ఫిల్మ్.
వాస్తవానికి ‘సారా జహాసే అచ్ఛా’ను ఆమిర్ ఖాన్ చెయ్యాల్సింది. రెండేళ్ల పాటు నాంచి, చివరకు షారుఖ్ పేరును ఆమిరే రికమెండ్ చేశాడు. గ్రీన్ సిగ్న ఇచ్చిన షారుఖ్ ఆ పాత్ర కోసం శిక్షణ సైతం తీసుకున్నాడు. ఏదేమైనా చివరి నిమిషంలో అతను తప్పుకోవడంతో, విక్కీకి ఆ అవకాశం దక్కినట్లయింది.
అంతర్గత వర్గాల వాళ్లు సైతం షారుఖ్ ఈ ప్రాజెక్టు చెయ్యకపోవడమే మంచిదంటున్నారు. ఎందుకంటే, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన షారుఖ్ సినిమా ‘జీరో’ సబ్జెక్ట్ స్పేస్-ట్రావెల్ కావడమే.