Sesh Rubbishes Marriage Rumours

నేను పెళ్లి చేసుకోవట్లేదు: అడివి శేష్
నాగార్జున మేనకోడలు సుప్రియను తాను పెళ్లాడనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ‘గూఢచారి’ హీరో అడివి శేష్ కొట్టిపారేశారు. ఇప్పుడు సినిమాలు తప్ప తనకు వేరే లోకం లేదని స్పష్టం చేశారు. “నా జీవితంలో ఇప్పుడు ఏకైక పెద్ద విషయం సినిమాలే. నటన, రచన. ఇంక వేరేదేమీ లేదు” అని ట్వీట్ చేశారు.
సుప్రియ, శేష్ పెళ్లి చేసుకోబోతున్నారని మంగళవారం పెద్ద ఎత్తున ఇంటర్నెట్లో ప్రచారం జరిగింది. వాళ్లిద్ధరి మధ్య సమంత సంధానకర్తగా వ్యవహరించిందంటూ కూడా వార్తలు వచ్చాయి. అదంతా వట్టి వదంతేనని శేష్ చెప్పారు. అసలు ఈ రూమర్ రావడానికి కారణం “ఈ నెలాఖరులోగా ఒక పెద్ద విషయం ప్రకటించబోతున్నా” అని శేష్ ట్వీట్ చేయడం.
అది కెరీర్‌కు సంబంధించిన ఒక పెద్ద వార్త అయి ఉంటుందని కొంతమందీ, పెళ్లికి సంబంధించింది అయి ఉంటుందనీ ఇంకొంత మందీ భావించారు. ఆయనింకా ఏ ప్రకటనా చెయ్యక ముందే సుప్రియను పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం గుప్పుమనడం గమనార్హం.
అయితే సుప్రియ పేరు ఇందులోకి ఎలా వచ్చిందన్నదే ప్రశ్న. ‘గూఢచారి’ సినిమా చేస్తున్నప్పట్నుంచీ ఆ ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారనీ, వాళ్ల మధ్య స్నేహాన్ని కొంతమంది ప్రేమగా భావించి, ఇలాంటి వదంతుల్ని సృష్టించారనీ వినిపిస్తోంది.
ఈ పెళ్లి ప్రచారం గురించి అడిగినప్పుడు “అది ఫేక్ న్యూస్” అని శేష్ స్పష్టం చేశారంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రిపోర్ట్ చేసింది.