Shocking News: Arjun Reddy Tamil Remake Varmaa Will Be Shot Again With New Cast And Crew!

షాకింగ్ న్యూస్: ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మా’ ఆగిపోయింది!
ఇది నిజంగా దిగ్భ్రాంతికర వార్త. తెలుగులో విజయ దేవరకొండ నటించగా సెన్సేషనల్ హిట్టయిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మా’ విడుదల ఆగిపోయింది. ఆ సినిమాని పూర్తిగా చాపచుట్టేసి, తిరిగి మొత్తం సినిమాని రూపొందించాలని దాని నిర్మాతలు సంకల్పించారు.
తమిళంలోని గొప్ప దర్శకుల్లో ఒకరైన బాలా డైరెక్ట్ చేసిన ఒక సినిమాకు ఇలాంటి స్థితి ఎదురవడం కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ద్వారా విక్రం కుమారుడు ధ్రువ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా నిర్మాణ సంస్థ ఇ4 ఎంటర్టైన్మెంట్స్ గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, కొత్త తారాగణం, సాంకేతిక నిపుణులతో మళ్లీ సినిమా తీస్తామని ప్రకటించింది.

ఆ ప్రకటన ప్రకారం బాలా స్థానంలో మరో దర్శకుడు రానున్నాడు. అయితే హీరోగా ధ్రువ్నే తీసుకున్నారు. ‘సృజనాత్మక విభేదాలు’ (క్రియేటివ్ డిఫరెన్సెస్) వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు.
“మా చేతికి వచ్చిన ఫైనల్ వర్షన్ చూసుకున్నాక మాకు సంతోషంగా అనిపించలేదు. వివిధ సృజనాత్మక, ఇతర విభేదాల వల్ల ఈ వెర్షన్‌ను విడుదల చేయకూడదని నిర్మించుకున్నాం” అని ఆ ప్రకటనలో ఇ4 ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలిపింది. కొత్తగా తీసే సినిమాని 2019 జూన్‌లో విడుదల చేస్తామని అందులో పేర్కొంది.

తెలుగు సినిమాని తమిళంలో పునఃసృష్టించడానికి బాలా నిర్మాణ సంస్థ బి స్టూడియోస్‌కు బాధ్యతలు అప్పగించింది ఇ4 ఎంటర్టైన్మెంట్. ‘వర్మా’లో మేఘా చౌధరి నాయిగా నటించగా, ఈశ్వరీరావు, రైజా విల్సన్, ఆకాశ్ ప్రేంకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు.
ధ్రువ్ మినహా ఈ సినిమాకు పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి బాలా నుంచి ఇంతవరకు స్పందన వ్యక్తం కాలేదు.
