Soundarya Rajinikanth Married To Vishagan Vanagamudi

కన్నుల పండువగా సౌందర్యా రజనీకాంత్ పెళ్లి వేడుక
ఇండియాలో పెళ్లి అనే శుభకార్యానికి ఉండే విలువ ఇంక ఏ కార్యక్రమానికీ ఉండదు. ఇద్దరి జీవితాలు ఒకరితో ఒకరికి ముడిపడతాయి కాబట్టే సంపన్నులే కాకుండా లేనివాళ్లు సైతం అప్పు చేసైనా గ్రాండ్‌గా పెళ్లిళ్లు చేస్తుంటారు. వివాహితులు పెళ్లి ఫొటోలు, వీడియోలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు.
ఎవరిదైనా సెలబ్రిటీ పెళ్లి అంటే అభిమానుల్లోనూ, సామాన్య ప్రజానీకంలోనూ ఉండే ఆసక్తి సంగతి చెప్పాల్సిన పని ఉండదు. అలాంటి ఒక సెలబ్రిటీ పెళ్లి సోమవారం జరిగింది. ఆ సెలబ్రిటీ సూపర్‌స్టార్ చిన్న కుమార్తె సౌందర్యా రజనీకాంత్. ఇక అభిమానుల హడావిడికి హద్దే లేదు.
నటుడు, వ్యాపారవేత్త విశాగన్ వనగమూడితో సౌందర్య పెళ్లి సోమవారం ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు ఆన్లైన్లో విస్తృతంగా చలామణీ అవుతున్నాయి. అంతకంటే ముందు, ఫిబ్రవరి 8నే ప్రి-వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి.
తన ట్విట్టర్ పేజీలో వాటికి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసిన సౌందర్య “మాటలకు అందని సంతోషంగా ఉంది. నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మగవాళ్లు ముగ్గురు.. నా ప్రియమైన నాన్న.. ఏంజెల్ లాంటి నా కొడుకు.. ఇప్పుడు నా విశాగన్.” అని ట్వీట్ చేసింది.
సంగీత్ వేడుకలో తన కూతుర్ని చూసుకుంటూ మురిసిపోతూ రజనీకాంత్ ఉద్వేగంగా డాన్స్ చేసిన వీడియో క్లిప్ ఒకటి ఇంటర్నెట్, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన సినిమా కౌంటర్ల దగ్గర టిక్కెట్ దొరికిన అభిమాని ఎలా డాన్స్ చేస్తాడో అలా డాన్స్ చేశాడు రజనీ.
సౌందర్య, విశాగన్ వివాహ వేడుకకు అనేకమంది రాజకీయ, సినీ, వ్యాపార వర్గాల ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నుంచి కమలహాసన్ దాకా వారిలో ఉన్నారు. అబు జాని సందీప్ ఖోస్లా బ్రాండ్ డిజైనర్ శారీలో సౌందర్య ఈ వేడుకలో మెరిసిపోయింది.


