The Most Rewatchable Film Of 2018

మళ్లీ మళ్లీ చూడాలనిపించే 2018 సినిమా
కొన్ని సినిమాలు చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది. ఒకసారి చూస్తే తృప్తి అనిపించదు. హృదయాన్ని హత్తుకొనే కథ, ఆస్వాదింపజేసే వినోదం, ఆసక్తికరమైన కథనం, ఒళ్లు జలదరింపజేసే యాక్షన్.. వీటిలో ఏవైనా కావచ్చు.. మనల్ని ఆ సినిమా వైపు ఎట్రాక్ట్ చేస్తుంటాయి.
2018లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని సృష్టించాయి. కొన్ని విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నాయి. కొన్ని ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. కొన్ని మంచి వినోదాన్ని అందించాయి. వాటన్నింటిలో పదే పదే చూడాలనిపించిన సినిమా ఏది? కచ్చితంగా పరశురాం డైరెక్ట్ చేసిన ‘గీత గోవిందం’.
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. పర్ఫెక్ట్ కేస్టింగ్కు చక్కని ఉదాహరణ ఈ సినిమా. పరుగులు పెట్టించే కథనం, ఆహ్లాదాన్ని పంచే సన్నివేశాలు, కుటుంబ బంధాల్ని ఎలివేట్ చేసే కథ, హృదయాల్ని స్పృశించే సన్నివేశాలు, సినిమా పూర్తయిపోయినా మనసుని వదలని హీరో హీరోయిన్ల పాత్రలు.. వెరసి ‘గీత గోవిందం’ కచ్చితమైన సినిమా.

నిజానికి ఇందులో హీరో కన్నా హీరోయిన్‌ది డామినెంట్ రోల్. అయినా తన నటనతో విజయ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాడు. విజయ్, రష్మిక జోడీ వాళ్లను బాగా అలరించింది. వాళ్ల మధ్య కెమిస్ట్రీ అపూర్వంగా పండింది. దానికి మూలం దర్శకుడు పరశురాం వాళ్ల మధ్య కల్పించిన సన్నివేశాలు, వాళ్లతో చేయించిన నటన.
విజయ్ కామెడీ టైమింగ్ ఎలాంటిదో ఈ సినిమాతో మరోసారి తెలిసొచ్చింది. ఇక సీరియస్‌గా కనిపిస్తూ, హీరోని ఆటపట్టించే క్యారెక్టర్లో రష్మిక నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. ఈ సినిమా తర్వాత విజయ్, రష్మిక.. ఇద్దరి ఇమేజ్ అమాతం పెరిగిపోయింది.
కాలేజీ లెక్చరర్ గోవింద్ పాత్రలో విజయ్ ఉన్నత స్థాయిలో రాణించాడు. అమ్మాయిల కలల రాకుమారుడు అయినా, ఉన్నత వ్యక్తిత్వం కలవాడు కావడంతో వాళ్ల నుంచి దూరం పాటిస్తూ వస్తాడు. ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.

అలాంటి వాడు ఒక బస్ ప్రయాణంలో తనతో కలిసి ప్రయాణిస్తున్న గీత అనే అమ్మాయిని చూసి చలించిపోయి చేసిన చిన్న తప్పుతో ఎలాంటి ఇరకాటంలో పడ్డాడు, ఆ అమ్మాయి అతడితో ఎలా ఆడుకుందీ అనే చిన్న లైన్‌పై రెండు గంటల పైగా కథ నడపడం చ్చిన్న విషయం కాదు. బస్‌లో పొరపాటున గీతకు పెట్టిన ముద్దు తర్వాత గోవింద్ జీవిత ప్రయాణం ఎలా మారిపోయిందో దర్శకుడు ఎక్కడా విసుగు పుట్టించకుండా మన ముఖాలపై నవ్వు వీడకుండా చిత్రించాడు.
గోవింద్ ఫ్రస్ట్రేషన్ మనకు ఫన్ కలిగిస్తుంది. గీత చేసే బెదిరింపుల మధ్య అతడు పడే అవస్థలు మనకు పాపం అనిపిస్తుంటాయి. అతడి పాత్రపై మనకు సానుభూతి కలగడమే కాదు, ఆ పాత్రతో మనమూ ప్రయాణిస్తాం, సహానుభూతి చెందుతాం. అతడు ఆ కష్టాల నుంచి బయట పడాలని కోరుకుంటాం. చివరకు గీత అతడి ప్రేమలోని స్వచ్ఛతను గుర్తించడం, ఇద్దరూ ఒక్కటవడం మన మనసులకు సంతృప్తినిస్తుంది.
అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అయితే గియితే హిట్టవుతుందని ఊహించిన వాళ్లను అమితాశ్చర్యానికి గురి చేస్తూ ‘గీత గోవిందం’ మీడియం బడెజ్ట్ సినిమాల్లో రికార్డులు సృష్టించింది. విజయ్ను స్టార్‌గా మరో మెట్టు, పరశురాంను డైరెక్టర్‌గా ఉన్నత స్థానాన్ని ఎక్కించింది.
