Tiger And Shraddha To Reunite For ‘Baaghi 3’

‘బాఘి 3’లో టైగర్ సరసన ‘సాహో’ హీరోయిన్
తెలుగు హిట్ ఫిల్మ్ ‘పరుగు’ హిందీ రీమేక్ ‘హీరోపంతి’తో హీరోగా పరిచయమై విజయం సాధించిన టైగర్ ష్రాఫ్, ‘బాఘి’ సినిమాతో యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆ సినిమాలో నాయికగా శ్రద్ధా కపూర్ నటించింది.
దాని సీక్వెల్ ‘బాఘి 2’లో టైగర్‌తో అతని గాళ్ ఫ్రెండ్ దిశా పటాని కనిపించింది. ఇప్పుడు ‘బాఘి 3’ చేయడానికి సిద్ధమవుతున్నాడు టైగర్. ఇందులో అతని సరసన నాయిక ఖరారయ్యింది.
ఈ సినిమాలో ఒరిజినల్లో నటించిన శ్రద్ధా కపూర్ మరోసారి టైగర్‌తో జోడీ కట్టనుంది. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె సంతకం చేసింది. సినిమాలో ఆమెపై కనీసం ఒక యాక్షన్ సీక్వెన్స్ అయినా ఉంటుంది.
ప్రస్తుతం శ్రద్ధ ‘సాహో’, ‘స్ట్రీట్ డాన్సర్’, ‘ఛిచ్ఛోర్’ సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉంది. ఆ సినిమాలను పూర్తి చేసి, ‘బాఘి 3’ షూటింగ్‌లోకి వస్తుందని సమాచారం.
ఈ వారాంతంలోగా ఆమె ప్రభాస్ కాంబినేషన్లో ‘సాహో’ సన్నివేశాలను పూర్తి చేయనుంది. వాటి తర్వాత కేవలం కొంచెం ప్యాచ్‌వర్క్ మాత్రమే ఆ సినిమాకు సంబంధించి మిగిలి ఉంటుంది. అవి పూర్తవగానే వరుణ్ ధావన్‌తో ‘స్ట్రీట్ డాన్సర్’ సెట్లోకి వెళ్తుంది. ఇక ‘ఛిచ్ఛోర్’ను మేలోగా పూర్తి చేస్తుందని తెలుస్తుందని అంతర్గత వర్గాలు తెలిపాయి.
‘బాఘి 3’ని 2020 మార్చి 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 2016లో ‘బాఘి’ ఫ్రాంచైజ్ మొదలైంది. రెండో సినిమా 2018లో వచ్చింది.