Varmaa Controversy: Bala Hits Back That It Was His Own Decision To Get Out Of The Project


Varmaa Controversy: Bala Hits Back That It Was His Own Decision To Get Out Of The Project
Director Bala

వాళ్లది తప్పుడు ప్రకటన.. నేనే తప్పుకున్నా: బాలా

ఈ వారం చిత్రసీమలోని అతి పెద్ద షాకింగ్ న్యూస్‌లో ‘వర్మా’ గురించిన వివాదం ఒకటి. సినిమాని ప్రకటించినప్పట్నుంచీ ‘వర్మా’ అనేది కోలీవుడ్‌లోని అత్యంత ఆసక్తికర చిత్రంగా రూపు దాల్చింది. అది విక్రం కొడుకు ధ్రువ్ పరిచయ చిత్రమే కాకుండా, తెలుగులో కల్ట్ ఫిలింగా పేరు పొందిన ‘అర్జున్‌రెడ్డి’కి అధికారిక రీమేక్ కావడం దానికి కారణం.

ఆ సినిమా పూర్తయి, ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఫస్ట్ లుక్, ట్రలర్లు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 14 విడుదలకు రంగం సిద్ధమైంది. హఠాత్తుగా అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ నిర్మాణ సంస్థ ఇ4 ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఒక ప్రకటన వెలువడింది.

‘వర్మా’ సినిమా మొత్తాన్ని తిరిగి కొత్త తారాగణం, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులతో తిరిగి చిత్రీకరిస్తామనీ, బాలా తీసిచ్చిన సినిమా చూసి తాము సంతృప్తి చెందకపోవడమే దీనికి కారణమనీ ఆ ప్రకటన సారాంశం.

ఇప్పుడు దీనిపై స్పందించాల్సిన వంతు బాలాది. ఆయన స్పందించారు. ఒక అధికారిక ప్రకటన వెలువరించారు. నిర్మాతలు తప్పుడు ప్రకటన చేశారని ఆరోపించారు. సినిమా నుంచి తప్పుకోవాలనేది చాలా ముందుగానే తాను తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పారు. దానికి సంబంధించి నిర్మాతలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను కూడా ఆయన షేర్ చేశారు.

“నిర్మాత తప్పుడు ప్రకటన వల్ల, నా సృజనాత్మక స్వేచ్ఛను కాపాడుకోడానికి ఈ వివరణ ఇవ్వక తప్పని స్థితి. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనేది నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం. ఈ వివరణతో పాటు 2019 జనవరి 22న నాకూ, నిర్మాతకూ జరిగిన ఒప్పంద పత్రాల్ని కూడా జతచేస్తున్నాను చూడండి. ధ్రువ్ విక్రం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, దీన్ని ఇంతటితో ముగించాలనుకుంటున్నా.” అని ఆ ప్రకటనలో తెలిపారు బాలా.

సినిమా నుంచి తప్పుకున్నానని అధికారికంగా నిర్ధారించాక, కొత్త తారాగణం, దర్శకుడు, టెక్నీషియన్లను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఉందంటూ గౌతం మీనన్, అల్ఫాన్స్ పుత్రన్, ఇంకా అనేకమంది దర్శకుల పేర్లు రంగం మీదికి వస్తున్నాయి. చివరికి ఎవరు ఈ చిత్రాన్ని చేపడతారో చూడాలి.

Varmaa Controversy: Bala Hits Back That It Was His Own Decision To Get Out Of The Project
A scene in Varmaa