Varmaa Controversy: Who Has The Creative Rights On The Movie?


Varmaa Controversy: Who Has The Creative Rights On The Movie?

‘వర్మా’ కాంట్రవర్సీ: సినిమాపై సృజనాత్మక హక్కులు ఎవరివి?

హీరోగా ధ్రువ్ విక్రమ్ పరిచయ చిత్రం ‘వర్మా’ను చెత్తబుట్టలో పడేయాలని ఆ చిత్ర నిర్మాత ముఖేశ్ ఆర్. మెహతా తీసుకున్న నిర్ణయం కోలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలా డైరెక్ట్ చేసిన ఆ సినిమాని కొత్తగా మళ్లీ తియ్యాలని నిర్మాత నిర్ణయించుకున్నారు. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేయగా తెలుగులో ఘన విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్ అయిన ‘వర్మా’ వేలైన్‌టైన్స్ డేకి విడుదల కావాల్సి ఉంది.

మొదట నిర్మాత ఒక ప్రటన విడుదల చేస్తూ ‘వర్మా’ ఫైనల్ వెర్షన్ చూశాక అసంతృప్తికి గురయ్యామనీ, క్రియేటివ్ డిఫరెన్సెస్, ఇతర విభేదాల కారణంగా ఆ సినిమాని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నామనీ తెలిపారు. దానికి బదులుగా ధ్రువ్ ప్రధాన పాత్రధారిగా ఒరిజినల్ సినిమా ఆత్మ చెడకుండా కొత్తగా సినిమా మొత్తాన్ని రీషూట్ చేస్తామనీ చెప్పారు.

దానికి సమాధానంగా సృజనాత్మక స్వేచ్ఛను కాపాడుకోడానికి తానే ఆ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని బాలా ప్రకటించారు. ధ్రువ్ విక్రమ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలనుకుంటున్నానని ఆయన అన్నారు.

అయితే నిర్మాత కానీ, దర్శకుడు కానీ ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని బయట పెట్టలేదు. దాంతో కోలీవుడ్‌లో ఈ ఘటన పెద్ద దుమారాన్నే లేపింది. సినిమా అనేది సమష్ఠి కృషి. అందులో దర్శక నిర్మాతలిద్దరికీ బాధ్యత ఉంటుంది.

Varmaa Controversy: Who Has The Creative Rights On The Movie?

అయితే ‘వర్మా’ విషయంలో జరిగిందేమంటే.. సినిమాని రూపొందించి ఫస్ట్ కాపీ తమ చేతిలో పెట్టేలా బాలాతో నిర్మాత ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో బాలా తన శైలిలో ఒరిజినల్‌కు భిన్నమైన రీతిలో ‘వర్మా’ను రూపొందించారని అంటున్నారు. ఒప్పందంలో చిన్నపాటి మార్పులు మినహా మిగతా సినిమాని ఒరిజినల్‌లో ఉన్నట్లే తియ్యాలని స్పష్టంగా ఉందని నిర్మాత వాదిస్తున్నారు.

ఈ వివాదంతో సినిమాకు సంబంధించిన సృజనాత్మక హక్కులు ఎవరికి ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. తెలుగు సినిమా అగ్ర దర్శకుల్లో ఒకరైన దాసరి నారాయణరావు “డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద మూవీ” అని ఎప్పుడూ అంటుండేవారు.

అయితే నిర్మాత అనేవాడు కేవలం పెట్టుబడిదారుడు మాత్రమే కాదనీ, సినిమాకు సంబంధించిన అన్ని విషయాల్లో అతనికి అవగాహన ఉండాలనీ మూవీ మొఘల్‌గా పేరుగాంచిన డి. రామానాయుడు చెప్పేవారు. రెండూ నిజాలే.

ఇటీవలి కాలంలో నిర్మాత పాత్రను పెట్టుబడి పెట్టేంతవరకే కుదించేశారనీ, పెద్ద సినిమాలకు సంబంధించి నిర్ణయాలన్నీ హీరో, డైరెక్టర్ మాత్రమే తీసుకుంటున్నారనీ అంటున్నారు. నిజానికి హీరో-డైరెక్టర్ కలిసి తమ సినిమాకు నిర్మాత ఎవరనేది నిర్ణయిస్తున్న రోజులివి.

కాగా దగ్గరలో విడుదల తేదీ పెట్టుకొని చివరి నిమిషంలో సినిమానే ఉపసంహరించుకొని, కొత్తగా సినిమా మొత్తాన్నీ తియ్యాలని నిర్ణయించడం మాత్రం ఇదే తొలిసారి.

తొలికాపీ అందించే పద్ధతిపై ‘వర్మా’ను రూపొందించిన బాలా, పోస్ట్ ప్రొడక్షన్ సందర్భంలో రషెస్ చూడ్డానికి ఎవరినీ అనుమంతించలేదని అంటున్నారు. నిర్మాత కానీ, ఆయన బృందం కానీ సెన్సార్‌కు కొద్ది రోజుల ముందు మాత్రమే ఫైనల్ కాపీ చూశారనీ, అది వాళ్లకు ఏమాత్రం నచ్చలేదనీ వినిపిస్తోంది. అందుకే దాన్ని చెత్తబుట్టలో పడెయ్యాలని నిర్ణయించారు.

బాలా మాత్రమే కాదు, ఇవాళ అత్యధిక శాతం దర్శకులు సెన్సార్‌కు ముందు మాత్రమే ఫైనల్ కాపీని నిర్మాతలకు చూపిస్తున్నారు. నిర్మాతలూ ఆ పద్ధతికి అలవాటుపడిపోయారు.

టాలీవుడ్‌లో అల్లు అరవింద్, సురేశ్‌బాబు, దిల్ రాజు వంటి కొద్దిమంది నిర్మాతలు మాత్రమే మధ్య మధ్యలో సినిమా ఎలా వస్తోందని పరిశీలిస్తున్నారు. దర్శకుడి సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకోకుండానే మొదటే నిర్మాత ఒక అవగాహన ఏర్పరచుకుంటే ‘వర్మా’ వంటి వివాదాలు చోటు చేసుకోవు.

Varmaa Controversy: Who Has The Creative Rights On The Movie?