What Is The Motive Behind Harish Rao’s Omission From The Cabinet?


What Is The Motive Behind Harish Rao's Omission From The Cabinet?
Harish Rao

హరీశ్ విషయంలో కేసీఆర్: అప్పుడలా.. ఇప్పుడిలా..!

అదృష్టాలు తారుమారయ్యే రాజకీయాల్లో ఒకటిన్నర దశాబ్దమంటే ఎక్కువ కాలం కిందే లెక్క. అధికారం, వెలుగు చవి చూశామని ఆనందపడేలోపే వాటికి దూరమయ్యే అవకాశమూ రాజకీయాల్లో సాధారణం. తెలంగాణ మాజీ నీటిపారుదల శాఖా మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు ఉదంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ.

ఒకసారి వెనక్కి వెళ్దాం. అది 2004 మే మాసం. ఎన్నికల అనంతరం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృతంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఎన్నికల ముందు కాంగ్రెస్, కె. చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్ఎస్ కూటమిగా ఏర్పడి, ఎన్నికల్లో గెలిచి, అంతకుముందు పదేళ్ల నుంచీ అధికారం అనుభవిస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాయి. అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన మేరకు టీఆర్ఎస్‌తో వైఎస్సార్ కలిసి ప్రయాణించక తప్పలేదని కాంగ్రెస్ వర్గాల్లో చలామణీ అయిన మాట.

ఎన్నికల్లో గెలిచాక, తన పార్టీకి చెందిన 24 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటుచేశారు వైఎస్సార్. దాదాపు ఒక నెల తర్వాత, టీఆర్ఎస్ నుంచి ఆరుగురితో మంత్రివర్గాన్ని విస్తరించారు. వారిలో హరీశ్‌రావు ఒకరు.

అయితే మిగతా ఐదుగురూ ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లు కాగా, కేసీఆర్ మేనల్లుడైన హరీశ్ అప్పుడు ఆ పార్టీ మీడియా కోఆర్డినేటర్ మాత్రమే. శాసనసభ్యుడు కాకపోయినా కాంగ్రెస్ హై కమాండ్‌ని డిమాండ్ చేసి మరీ హరీశ్‌ను మంత్రిని చేయించారు కేసీఆర్.

సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్, ఆ తర్వాత ఆ సీటును మేనల్లుడి కోసం ఖాళీ చేశారు. అప్పట్నుంచీ అప్రతిహతంగా ఆ నియోజక వర్గం నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో గెలుస్తూ వస్తున్నారు హరీశ్.

ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. గత ఎన్నికల్లో పార్టీలోని అందరికంటే మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిచారు హరీశ్. పార్టీలోని అత్యంత ఆకర్షణీయ నాయకుల్లో ఒకరిగా, గొప్ప వక్తగా, ఉన్నతస్థాయి కార్యనిర్వాహకుడిగా, ప్రజల్లో అపారమైన ఇమేజ్ కలిగిన నాయకుడిగా పేరు పొందారు. కానీ, ఈసారి రాష్ట్ర కేబినెట్లో ఆయనకు మొండిచేయి ఎదురైంది. కారణాలేమిటనేవి కేసీఆర్‌కు మాత్రమే తెలుసు.

హరీశ్‌కు మంత్రి పదవి దక్కకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేట మున్సిపాలిటీ కార్పొరేటర్ అయిన మరుపల్లి భవానీ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు కేబినెట్లో తనకు స్థానం లభిచకపోవడంపై ఎలాంటి దురుద్దేశాలూ ఆపాదించుకోవద్దని ప్రజల్ని కోరారు హరీశ్.

ఎన్నికల ప్రసంగాల్లో చెప్పినవిధంగా టీఆర్ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ఉంటాననీ, పార్టీ, ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు కట్టుబడి ఉంటాననీ చెప్పారు.