When Basavatarakam Turns Guru For NTR!


When Basavatarakam Turns Teacher For NTR!

రామారావుకు బసవతారకం గురువుగా మారిన వేళ..!

‘యన్.టి.ఆర్: కథానాయకుడు’లో దర్శకుడు క్రిష్ ఒక ఆసక్తికర సన్నివేశాన్ని కల్పించాడు. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్‌కు ఆయన సతీమణి బసవతారకం గురువుగా మారుతుంది. ఇది ఓ సినిమా సన్నివేశం సందర్భంగా జరిగినట్లు క్రిష్ చూపించాడు.

‘పెళ్లి చేసి చూడు’ సినిమాలో ఎన్టీఆర్‌పై ఒక పాట సన్నివేశాన్ని దర్శకుడు ఎల్వీ ప్రసాద్ (జిషుసేన్ గుప్తా) చిత్రీకరిస్తుంటాడు. ఆ పాట.. ‘పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్..’. ఎన్టీఆర్ హార్మోనియం వాయిస్తూ ఆ పాటను రాగయుక్తంగా ఆలపించాలి.

ఎన్టీఆర్ పాడుతుంటే ఎల్వీ ప్రసాద్ కట్ చెప్పి “మిస్టర్ రామారావ్.. కాన్సంట్రేషన్ పాట మీద, లిప్ మూవ్‌మెంట్ మీద, ఎట్ ద సేం టైం హ్యాండ్ మూవ్‌మెంట్ మీద కూడా ఉండాలి. వూ.. చాలా నేచురల్‌గా ఉండాలి.. ఓకే” అని చెప్తాడు.

సన్నివేశాన్ని కెమెరాతో షూట్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ మార్కస్ బ్రాట్లే “మిస్టర్ రామారావ్.. ఇంతకు ముందెప్పుడూ హార్మోనియం ప్లే చెయ్యలేదు కదా మీరు?” అనడుగుతాడు.

“లేదండీ.. మా ఆవిడకొచ్చు. చూస్తుంటాను” అని నిజాయితీగా చెప్తాడు ఎన్టీఆర్. అక్కడే ఉండి ఈ షూటింగ్ చూస్తున్న బసవతారకంతో ఎల్వీ “అయితే ఇంకేం.. మిసెస్ రామారావ్.. రామ్మా” అని పిలుస్తాడు.

బసవతారకం ఆశ్చర్యపోతూ “నేనా?” అంటుంది మొహమాటంగా.

నాయిక జి. వరలక్ష్మి “రండి.. వచ్చి మీ వారికి నేర్పించండి” అని చెప్తుంది. “అయ్యో..” అని బసవతారకం వెనకాడుతుంటే, ఆమె వెనుకే ఉన్న ఎన్టీఆర్ మేకప్‌మ్యాన్ పీతాంబరం “పర్లేదు.. వెళ్లండమ్మా” అని ప్రోత్సహిస్తాడు.

ఎన్టీఆర్ కూడా “రా తారకం” అని పిలుస్తాడు. అయినా ఆమె వెనుకాడుతుంటే, “తారకం రా” అని కాస్త గట్టిగానే పిలుస్తాడు మళ్లీ. వెనుక పాటను ప్లే చేస్తుంటే బసవతారకం హార్మోనియం వాయిస్తుంది. ఒక పక్కన ఎన్టీఆర్, ఇంకో పక్కన వరలక్ష్మి కూర్చొని శ్రద్ధగా చూస్తుంటారు.

When Basavatarakam Turns Teacher For NTR!

ఆమె ఎలా వాయిస్తోందో ఎన్టీఆర్ పరిశీలనగా చూస్తాడు. ఎల్వీ, మార్కస్ మైమరచి ప్రశంసగా చూస్తుంటారు. వాయించడం అయిపోగానే అందరూ చప్పట్లు కొడతారు.

ఎల్వీ “మార్వలెస్. వూ.. అభినయానికీ, సంగీతానికీ పెళ్లయ్యిందన్న మాట.. రామారావ్! చూశావ్‌గా.. మీ ఆవిడలా నటించు.. చాలు” అంటాడు. నవ్వుతూ “యస్” అని తలూపుతాడు రామారావ్.

బసవతారకం సిగ్గుపడుతూ ఇవతలికి వస్తుంటే, రెండు చేతులతో ఆమెకు నమస్కరిస్తూ “ధన్యవాదాలు గురువు గారూ.. (తలపై చేయిపెట్టుకొని) శిష్యుడెలా చేస్తున్నాడో కాస్త చూడండి” అని నాటకీయంగా చెప్పి గట్టిగా నవ్వేస్తాడు రామారావ్.

ఆ తర్వాత హార్మోనియంను ఇబ్బంది పడకుండా వాయిస్తూ ఆ పాటలో అభినయిస్తాడు.

ఈ సన్నివేశాన్ని తన ఊహాశక్తితో ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా చిత్రించాడు క్రిష్. బాలకృష్ణ, విద్యాబాలన్, జిషుసేన్ గుప్తా చక్కగా అభినయించారు.

When Basavatarakam Turns Teacher For NTR!