Who Will Be The Hero For Maruthi’s Next?

మారుతి తర్వాతి సినిమాలో హీరో ఎవరు?
ప్రస్తుత దర్శకుల్లో ఎక్కువ విజయాలు సాధించిన దర్శకుల్లో మారుతి ఒకరు. ‘ఈ రోజుల్లో’ నుంచి ‘శైలజారెడ్డి అల్లుడు’ వరకు ఆయన ఏడు సినిమాలు డైరెక్ట్ చేశాడు. ‘ప్రేమకథా చిత్రం’కి తనే డైరెక్టర్ అని చెప్పుకుంటాడు కానీ క్రెడిట్స్‌లో జె. ప్రభాకరరెడ్డి పేరు మాత్రమే ఉంది కానీ మారుతి పేరు లేదు. రికార్డుల్లో ఉన్నదాన్నే పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి అధికారికంగా ఆయన ఏడు సినిమాల డైరెక్టరే. ఈ ఏడింటిలో ఐదు సినిమాలు హిట్. అంటే విజయ శాతం 71.
వెంకటేశ్‌తో చేసిన ‘బాబు బంగారం’, నాగచైతన్య హీరోగా చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ మాత్రమే బయ్యర్లకు లాభాలు అందించలేకపోయాయి. ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ సినిమాల్లో బూతు ఎక్కువగా ధ్వనించిందనే పేరు రావడంతో, ఆ తర్వాత ఆయన రూటు మార్చాడు. ‘కొత్త జంట’, ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ సినిమాలతో తను బూతు చిత్రాల దర్శకుడిని కాదని నిరూపించుకున్నాడు.

అతని చివరి సినిమా ‘శైలాజరెడ్డి అల్లుడు’ 2018 సెప్టెంబర్‌లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద్ బోల్తా కొట్టింది. దాదాపు ఐదు నెలలు గడిచాయి. ఇప్పటివరకు మారుతి తదుపరి సినిమా గురించిన సమాచారం బయటకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘భలే భలే మగాడివోయ్’ హిట్ తర్వాత ఆయనతో సినిమాలు చెయ్యడానికి పెద్ద హీరోలు సైతం ఆసక్తి చూపిస్తూ వచ్చారు. ‘శైలజారెడ్డి అల్లుడు’ వైఫల్యంతో ఆయన డిమాండ్ తగ్గిందా? అనే సందేహాలు వస్తున్నాయి.
అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే తర్వాతి సినిమా కోసం ఆయన ఒక ఆసక్తికర స్క్రిప్టు తయారుచేశారు. ఆయన బలమంతా వినోదమే కాబట్టి అది కూడా వినోదం ప్రధానంగా ఉండే స్క్రిప్ట్ అని తెలుస్తోంది. ఇప్పటికే దీన్ని ఓ పేరున్న యువ హీరో ఓకే చేశాడనీ, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందనీ అంటున్నారు. అప్పుడే ఈ సినిమాని ఎవరు నిర్మించేదీ తెలియనున్నది.