Yatra Review: 4 Ups And 3 Downs


Yatra Review: 4 Ups And 3 Downs
A Scene From Yatra

‘యాత్ర’ రివ్యూ: నాలుగడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి

తారాగణం: మమ్ముట్టి, రావు రమేశ్, సుహాసిని, ఆశ్రిత, సచిన్ ఖేడ్కర్, పోసాని కృష్ణమురళి, జీవా, వినోద్ కుమార్, పృథ్వీ, కల్యాణి, శేఖర్, అనసూయ

దర్శకుడు: మహి వి. రాఘవ్

విడుదల తేదీ: 8 ఫిబ్రవరి 2019

ఒక ప్రాంతీయ నాయకుడై ఉండీ కాంగ్రెస్ అధీష్ఠాన్ని తాను చెప్పినట్లు నడిచేట్లు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని అతి కీలక ఘట్టంగా చెప్పే పాదయాత్రను ఆధారం చేసుకొని, దానికి నాటకీయతను, కాల్పనికతను జోడించి తీసిన సినిమా ‘యాత్ర’.

మహి వి. రాఘవ్ అనే ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం లేని దర్శకుడు రూపొందించిన ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు కానీ, విడుదల సమయానికి హైప్ తీసుకు రావడంలో దర్శక నిర్మాతలు సక్సెసయ్యారు.

 నైజాం, వైజాగ్ ఏరియాలకు దిల్ రాజు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చెయ్యడం చివరి నిమిషంలో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఆంధ్రప్రదేశ్‌లో మరో 4 నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణాన విడుదల కావడం ఈ సినిమాకి ఒక ప్రాధాన్యం కూడా ఏర్పడింది.

వైఎస్సార్ జగమెరిగిన, జనం మెచ్చిన, జన హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన నాయకుడు. ఆయన కథ తెలియనివాళ్లెవ్వరు? దర్శకుడు కూడా జనానికి తెలీని విషయాలేమీ చెప్పలేదు. తెలిసిన విషయాల్నే గుదిగుచ్చి, పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.

‘యాత్ర’ ప్రధానంగా ఎమోషన్స్ మీద ఆధారపడ్డ సినిమా. అంతకంటే ఎక్కువగా వైఎస్సార్ పాత్రధారి మీద ఆధారపడ్డ సినిమా. పాత్రధారి ఫెయిలైతే, ఎమోషన్స్ ఎంత బలంగా ఉన్నా వృథా అయిపోతుంది. దర్శకుడు గొప్పగా ఎక్కడ సక్సెసయ్యాడంటే వైఎస్సార్ పాత్రను చెయ్యడానికి మమ్ముట్టిని ఒప్పించడంలో.

Yatra Review: 4 Ups And 3 Downs
A Scene From Yatra

అయితే ఆ పాత్రలో మమ్ముట్టి ఒదుగుతారా?.. అనే సందేహం చాలామందిలో ఉంది. వైఎస్సార్‌గా మమ్ముట్టి నప్పుతారా?.. అనే సంశయం ఆయన అభిమానుల్లో ఉంది. ఎందుకంటే రాజశేఖరరెడ్డిది నవ్వు ముఖం. గుండ్రటి ముఖం. మమ్ముట్టిది అందుకు భిన్నమైన కోలముఖం. సినిమాలో ఆ తేడా స్పష్టంగా తెలుస్తోంది.

మమ్ముట్టి వైఎస్సార్‌లా అనిపించలేదు. కానీ ఆ పాత్రను ఆవాహన చేసుకున్నట్లు నటించారు. తనకే సాధ్యమైన అత్యున్నత స్థాయి నటనతో రాజశేఖరరెడ్డి పాత్రకు జీవాన్నిచ్చారు. ‘యాత్ర’ చూశాక మమ్ముట్టిని కాకుండా మరో నటుడ్ని మనం ఊహించుకోలేం.

తెలుగులో ఎంతో మంది ప్రతిభావంతులైన నటులున్నారు. వైఎస్సార్ దుర్మరణం పొందాక డాక్టర్ రాజశేఖర్‌తో రాజశేఖరరెడ్డి బయోపిక్ తీస్తానని పూరి జగన్నాథ్ అధికారికంగా ప్రకటించాడు. రాజశేఖర్ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ పాత్ర పోషణ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. కానీ తర్వాత ఆ బయోపిక్ పట్టాలెక్కలేదు.

ఏదేమైతేనేం.. ఏ సినిమాకైనా కేస్టింగ్ చాలా కీలకం. బయోపిక్‌లకైతే మరీ! దర్శకుడు మమ్ముట్టిని ఎంచుకొని మొదటి సక్సెస్‌ను సాధించాడు. అలాగే వైఎస్ ఆత్మగా పేరుపొందిన కేవీపీ రామచంద్రరావు పాత్రను రావు రమేశ్‌తో చేయించడం కూడా. మమ్ముట్టి, రావు రమేశ్ కాంబినేషన్ తెరపై గొప్పగా రాణించింది.

కేవీపీగా రావు రమేశ్ “రాజా” అని రాజశేఖరరెడ్డిని ఆవాహన చేసుకున్న మమ్ముట్టిని సంబోధించినప్పుడల్లా ఆ ఇద్దరి అనుబంధం తెలిసినవాళ్లకు ఆ రోజులు గుర్తుకు రాకుండా ఉండవు. మమ్ముట్టి వైఎస్సార్‌లా తెరపై బిహేవ్ చెయ్యలేదు. వైఎస్సార్‌లా కనిపించడానికి యత్నించలేదు.

ఇక ఆయనలా మాట్లాడ్డానికి అస్సలు ప్రయత్నించలేదు. తెలుగు తెలీని ఆయన సంభాషణలను అర్థం చేసుకొని తన స్వభావసిద్ధమైన గొంతుతోనే మాట్లాడాడు. అయినా వైఎస్సారే మరో రూపంలో మన ముందు ప్రత్యక్షమయ్యారా అనిపిస్తుంది. సన్నివేశాలకు తగ్గట్లు మమ్ముట్టి ముఖం నుంచి వ్యక్తమైన హావభావాలు మనల్ని ఆయనే వైఎస్సార్ అనిపించేలా చేస్తాయి.

Yatra Review: 4 Ups And 3 Downs
A Scene From Yatra

“ఇది పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయం రెడ్డీ. సో యు హావ్ టు ఒబే పార్టీ ఆర్డర్స్” అంటాడు ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు. “నా విధేయతనీ, విశ్వాసాన్నీ బలహీనతగా తీసుకోవద్దండీ” అంటాడు రాజశేఖరరెడ్డి. “రెడ్డీ సాబ్. మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి” అంటాడు నాయకుడు.

“మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను. ఇచ్చాక ఆలోచించేదేముంది? ముందుకెళ్లాల్సిందే” అని సమాధానమిస్తాడు రాజశేఖరరెడ్డి. అవసరమైతే పార్టీ హైకమాండ్‌ను ఖాతరు చెయ్యని, తన మాటకు, చేతకు తిరుగులేదని ప్రవర్తించేవాడిగా వైఎస్సార్‌ను దర్శకుడు ప్రొజెక్ట్ చేశాడు.

జనం కోసం అవసరమైతే పదవిని సైతం వదులుకోడానికి సిద్ధంగా ఉండేవాడిలా చూపించాడు. పార్టీ హైకమాండ్‌నే కమాండ్ చేసేవాడిగా ఆయనను హీరోయిక్‌గా చూపించడం ఆయన అభిమానుల్ని సంతృప్తి పరుస్తుంది. ఆ సన్నివేశాలను మహి ఎమోషన్స్‌తో బాగా డీల్ చేశాడు.

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలిసినప్పుడు, రాజకీయాల నుంచే తప్పుకుందామా అని ఆలోచన వచ్చినప్పుడు, అనుకోకుండా ఒక వాన వచ్చినరోజు ఊళ్లో జనాన్ని కలిసే అవకాశం వచ్చినప్పుడు, వాళ్లు పడుతున్న కష్టాల్ని విన్నప్పుడు వైఎస్సార్‌లో ఒక ఆలోచన మెదులుతుంది. అదే రాష్ట్ర గతినీ, ప్రజల గతినీ మార్చే ఒక చారిత్రక సందర్భానికి బాట పరుస్తుంది.

“నాయకులుగా మనకేం కావాలో తెలుసుకోగలిగాం కానీ జనాలకేం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలనుంది. వినాలనుంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలనుంది” అని దృఢంగా నిశ్చయించుకున్నాడు రాజశేఖరరెడ్డి. అంటే పాదయాత్రకు సిద్ధమయ్యాడన్న మాట!

నిజానికి ఆయన పాదయాత్ర ఉద్దేశం జనాభిప్రాయాన్నీ, వాళ్ల స్థితిగతుల్ని తెలుసుకోవడమా? లేక జనాన్ని ఆకర్షించి, జన నాయకుడిగా పేరు తెచ్చుకొని అధికారాన్ని హస్తగతం చేసుకోడమా? ఈ విషయంలో వైఎస్సార్‌ను డైరెక్టర్ ఎలా ప్రొజెక్ట్ చేశాడు?

అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి వైఎస్సార్ ఆ ‘యాత్ర’ చెయ్యాలేదనీ, జనం కష్టసుఖాలు తెలుసుకొని, అందుకు తగ్గట్లు తన కార్యాచరణను రూపొందించుకోవాలనీ, జనం కోసమే బతకాలనే ఉద్దేశంతోనే ‘యాత్ర’ చేశాడనీ ఈ సినిమాలో మనం చూస్తాం. ఆ క్రమ పరిణామాల్ని నేర్పుగా తెరపైకి తెచ్చాడు దర్శకుడు.

Yatra Review: 4 Ups And 3 Downs
A Scene From Yatra

శంఖం పూరించి పాదయాత్ర మొదలుపెట్టాడు రాజశేఖరరెడ్డి. దానికి ముందు తాండూరు నుంచి యాత్ర మొదలుపెడితే బాగుంటుందని కేవీపీ సూచిస్తే, సబితా ఇంద్రారెడ్డి (సుహాసిని) కూడా అదే బాగుంటుందనీ, అక్కడ్నుంచి చేవెళ్లకు వచ్చి, అక్కడ ఒక సభ పెడితే బాగుంటుందనీ అంటుంది. “అయితే తాండూరు ఎందుకు? చేవెళ్ల నుంచే యాత్ర మొదలుపెడదాం” అంటాడు వైఎస్సార్.

తను వితంతువు కావడాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ “మాలాంటి వాళ్లను అపశకునంలా భావిస్తారన్నా” అని సబిత అంటే, “మంచి పనికి మంచి మనసుంటే చాలమ్మా.. ఏం ఫర్వాలేదు. మనం చేవెళ్ల నుంచే యాత్ర మొదలుపెడ్తాం” అని అలాగే చేస్తాడు.

ఓ వైపు మూఢ నమ్మకాల్ని పాటించని వ్యక్తిగా చూపిస్తూనే, అదే సమయంలో భావోద్వేగాలకూ, అనుబంధాలు, ఆత్మీయతకూ వైఎస్సార్ ఎంత విలువిస్తారో ఈ సన్నివేశాలతో కళ్లకు కట్టించాడు దర్శకుడు.

పాదయాత్ర సన్నివేశాలు చాలావరకూ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఒక బారీ సినిమాలోని సన్నివేశాలకు జనాన్ని సమీకరించినట్లు, ఆ యాత్రలో పాల్గొనే జనాన్ని భారీగా సమీకరించి సన్నివేశాలు చిత్రీకరించాడు మహి. జనంతో వైఎస్సార్ ఎలా మమేకమయ్యారో, వాళ్లలో ఒకడిగా ఎలా కలిసిపొయ్యారో ప్రభావవంతంగా దర్శకుడు చూపించాడు.

నేపథ్యంలో పాటలు నడుస్తుండగా యాత్ర సన్నివేశాల్ని తియ్యడం మెప్పిస్తుంది. సంభాషణల విషయంలోనే ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధపెట్టి ఉంటే బాగుండుననిపిస్తుంది. జనాన్ని ఉద్దేశించి వైఎస్సార్ చేసే ప్రసంగాల్లోని మాటలు ఎమోషన్‌కి తగినట్లుగా కాకుండా పత్రికా భాషలో నడిచాయి. సీమవాసి కాబట్టి సీమ యాసలోనే వైఎస్సార్ నోట మాటల్ని పలికిస్తే ఎమోషన్స్ ఇంకా బాగా పండేవి. ఏదేమైనా ‘యాత్ర’ అనే టైటిల్‌కు పాదయాత్ర ఘట్టాలన్నీ న్యాయం చేశాయనే చెప్పాలి.

Yatra Review: 4 Ups And 3 Downs
A Scene From Yatra

యాత్రలో నీరసించి డీహైడ్రేషన్‌కు గురై పడిపోయిన వైఎస్సార్ ప్రభుత్వాసుపత్రిలో రోగుల కష్టాలు చూసి చలించిపోవడం సినిమాలోని హైలైట్ పాయింట్లలో ఒకటి. అక్కడే ఆయన కళ్ల ముందు ఒక పాప గుండెకు రంధ్రం పడిన కారణంగా చనిపోవడం గుండెల్ని మెలిపెడుతుంది.

గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్న కూతుర్ని దక్కించుకోడానికి అవసరమైన డబ్బు కోసం తొమ్మిదేళ్ల వయసున్న పెద్ద కూతుర్ని ఒక సంపన్న కుటుంబంలో పనిమనిషిగా పంపడానికి ఒక తల్లి (కల్యాణి) పడ్డ వేదన మనసుల్ని కలచివేస్తుంది. పేదరికం ఎన్ని అవస్థల్ని తెచ్చిపెడుతుందో వైఎస్సార్ అక్కడే ప్రత్యక్షంగా చూసినట్లు చిత్రించాడు దర్శకుడు.

“అన్నిటికన్నా అతి పెద్ద జబ్బు కేన్సరో, గుండెజబ్బో కాదయ్యా.. పేదరికం. పేదరికాన్ని మించిన శిక్షే లేదయ్యా” అంటాడు అక్కడున్న రోగులు, వాళ్లతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులతో. అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ తీసుకొచ్చిన ‘ఆరోగ్యశ్రీ’కి అదే కారణమని మనం ఊహిస్తాం. ఆ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమందికి ప్రయోజనం కలిగిందో, పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్‌కు ఎంతటి గొప్ప స్థానం లభించిందో చరిత్రలో చూశాం.

మార్కెట్‌లో టమోటాలు అమ్ముకోడానికి వచ్చిన రైతు (‘ఛత్రపతి’ శేఖర్) కిలో రూపాయిన్నరకంటే ఎక్కువ ధర రాకపోవడంతో అతను చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యా యత్నం చెయ్యడం, వోకల్ కార్డ్ దెబ్బతిన్న అతను తనను పరామర్శించడానికి వచ్చిన వైఎస్సార్‌తో మాట్లాడటానికి ప్రయత్నించడం, డాక్టర్ అతను మాట్లడలేడని అంటే, “నాకు వినపడుతుందయ్యా” అనడం.. ప్రేక్షకుల్ని సూటిగా తాకే భావోద్వేగ సన్నివేశాలు.

‘యాత్ర’ తెచ్చిన ఇమేజ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారు. సహజంగానే ముఖ్యమంత్రి పదవి ఆయనకే దక్కింది. మళ్లీ ఐదేళ్ల తర్వాత రెండోసారీ అధికారంలోకి వచ్చారు. కానీ విధి వక్రించి గాలివానలోనే హెలికాప్టర్‌లో ప్రయాణించి దుర్మరణం పాలయ్యారు వైఎస్సార్. చివరి పది నిమిషాలూ మనకు వైఎస్సార్‌గా మమ్ముట్టి కనిపించరు.

నిజ ఘటనలనే సినిమాకు జోడించాడు దర్శకుడు. నిజమైన రాజశేఖరరెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చెయ్యడం, ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలను ప్రవేశపెట్టడం, దేవుడిగా జనాలు ఆయనను కొలవడం, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, అది తెలిసి జనమంతా గుండెలవిసేలా దుఃఖించడం.. ఇవి ఈ సినిమా కోసం చిత్రీకరించినవి కావు.

ఇదివరకే రికార్డయి ఉన్న వాస్తవ వీడియో సన్నివేశాలు. వాటిని సందర్భానుసారం క్లైమాక్స్‌కి ఉపయోగపెట్టుకున్నారు. అవి చూసిన ప్రేక్షకులు ఒక దుఃఖ భారంతో బయటకు వస్తారు. మరోసారి వైఎస్సార్‌ను గుర్తు చేసుకొని కళ్లను తడి చేసుకుంటారు.

Yatra Review: 4 Ups And 3 Downs
A Scene From Yatra

సినిమాలో వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మి పాత్ర ఉంది కానీ ఆయన పిల్లలు.. జగన్మోహనరెడ్డి, షర్మిళ పాత్రలు లేకపోవడం ఒకింత అసంతృప్తి కలిగిస్తుంది. జగన్ పాత్ర ఒక సందర్భంలో ఫోన్ చేసినట్లు చూపించారు కానీ కనీసం ఆయన వాయిస్ కూడా వినిపించలేదు. క్లైమాక్స్‌లో నిజ సన్నివేశాల వీడియోల్లో మాత్రం నిజమైన జగన్ కనిపించారంతే.

వైఎస్సార్‌ను కేవలం పొలిటికల్ యాంగిల్లోనే ప్రొజెక్ట్ చేసి, ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా ఆయన ఎలా ఉండేవారనే విషయాన్ని చూపించకపోవడం మైనస్ పాయింట్. మహిళా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేవి కుటుంబ భావోద్వేగాలే. విజయమ్మ పాత్ర కూడా ఇలా కనిపించి అలా మాయమవుతూ ఉండటం అభిమానుల్ని నిరాశకు గురిచేసే అంశమే.

తెలుగుదేశం పార్టీని ‘మనదేశం’ పార్టీగా చూపించారు. పసుపు చొక్కాలను అలాగే ఉంచారు. ఆ పార్టీ నాయకులు కనిపిస్తారు కానీ చంద్రబాబునాయుడు పాత్ర కనిపించదు. ఒక చోట ఫోన్‌లో వినిపించారు.. అదీ వెంకట్రావు (పోసాని కృష్ణమురళి)ను కోవర్ట్ ఆపరేషన్ కింద వైఎస్సార్ దగ్గరకు పంపించి సమయం వచ్చినప్పుడు ‘చేయి’ ఇచ్చేలా డీల్ కుదిర్చే సందర్భంలో మనదేశం నాయకులు వెంకట్రావుతో బాబు చేత మాట్లాడిస్తారు.

ఈ సన్నివేశానికి తెలుగుదేశం పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

అంతిమంగా ఈ సినిమా వై.ఎస్. జగన్మోహనరెడ్డికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోషన్‌గా ఉపయోగపడనున్నదా? జగన్ సైతం ఇటీవలే పాదయాత్ర చేశారు. వైఎస్సార్ యాత్రను చూపిస్తే జగన్ చేసిన యాత్రను చూపించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా ప్రజల్లో ఆ యాత్ర ఇంపాక్ట్‌ను ఎన్నికల వరకు నిలిపే అవకాశం ఉంటుందనేది వాళ్ల అభిప్రాయం.

ఇది ఎన్నికల్లో జగన్ పార్టీకి లాభిస్తుందని ఆ పార్టీ నాయకులూ భావిస్తున్నారు. అందుకే సినిమాలో కాంగ్రెస్ పార్టీని కాకుండా వైఎస్సార్‌నే హైలైట్ చేశారు. పాదయాత్ర సన్నివేశాల్లో ప్రదర్శించిన జెండాల్లో కాంగ్రెస్ పార్టీ పేరు కాకుండా వైఎస్సార్ పేరు, ఆయన రూపమే ఎక్కువగా కనిపిస్తుంది.

‘ప్రజా ప్రస్థాన యాత్ర’ అనే అక్షరాలు పెద్దగా కనిపిస్తాయి కానీ, కాంగ్రెస్ పార్టీ పేరు కనిపించదు, పిడికిలి బిగించిన చేయి (హస్తం కాదు) గుర్తు తప్ప!

– బుద్ధి యజ్ఞమూర్తి