ఆ మలుపుతోటే ‘118’ హిట్టయింది!


ఆ మలుపుతోటే '118' హిట్టయింది!

ఆ మలుపుతోటే ‘118’ హిట్టయింది!

మనమంతా కథలో వచ్చే మంచి మలుపుని ఇష్టపడతాం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కూడా ఒక్కోసారి వచ్చే మలుపు మనల్ని ఉద్వేగానికి గురిచేసి, దానికి బాగా కనెక్టయిపోతాం. ఉదాహరణకు ‘పోకిరి’ సినిమాలో మహేశ్ క్రిమినల్ కాదనీ, కృష్ణమనోహర్ అనే పోలీసాఫీసర్ అని రివీల్ అయ్యే సీన్ హైలైట్ పాయింట్‌గా నిలిచి సినిమా ఘన విజయంలో ప్రధాన కారణంగా నిలిచింది.

ఇక థ్రిల్లర్ సినిమాల్లో అయితే అడుగడుక్కీ మలుపులు వస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇటీవల వచ్చిన ‘118’ సినిమాలో వచ్చే ఒక ట్విస్ట్ మరీ అనూహ్యం. లాజిక్‌కి ఏమాత్రం అందని ఆ విషయాన్ని మెడికల్‌గా సాధ్యమేనని చెప్పే ఆ మలుపు ప్రేక్షకులకు కనెక్టయితేనే సినిమా ఆడుతుందనీ, కనెక్ట్ కాకపోతే ఫ్లాపవుతుందనీ అనిపించింది.

ఆ మలుపు ఆద్య (నివేదా థామస్) ఏమైందనే విషయం తెలుసుకోడానికి గౌతమ్ (నందమూరి కల్యాణ్‌రామ్) తనకొచ్చే కలలోకి తానే వెళ్లడం. ఆద్య ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు కనిపించకుండా పోయిందనేది ప్రపంచానికి మిస్టరీగా మారినవేళ, తనకొచ్చిన కలలోకి వెళ్లిన గౌతంకు ఆద్యను దుండగులు ఎలా హత్యచేశారో, ఎక్కడ ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టారో చూడగలుగుతాడు. దాంతో మిస్టరీ వీడిపోతుంది. దుండగులు చట్టానికి దొరికిపోతారు.

గౌతంకు ఇలా కలలోకి వెళ్లొచ్చనే విషయాన్ని ఒక సైకియాట్రిస్ట్ (నాజర్) చెబుతాడు. ఎలా వెళ్లొచ్చో కూడా చెబుతాడు. గతంలో అలాంటి కొన్ని ఉదాహరణల్నీ ఉటంకిస్తాడు. ఆ డాక్టర్ చెప్పినట్లే చేస్తాడు గౌతమ్.

తెలుగు సినిమాలో ఈ తరహా పాయింట్ బాగా కొత్త. కథలోని మిస్టరీని ఛేదించేది ఈ పాయింటే. అయినా దర్శకుడు కె.వి. గుహన్ చెప్పిన ఈ పాయింట్‌ను కల్యాణ్‌రామ్ నమ్మాడు. చేశాడు. కానీ ప్రేక్షకులు ఈ పాయింట్‌ను హర్షిస్తారా? తమని పిచ్చివాళ్లకింద జమ కడుతున్నారా? అని ప్రేక్షకులు ఫీలైతే ‘118’ ఢమాల్ అయ్యేది. కానీ రూ. 10 కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలిచిందీ అంటే ప్రేక్షకులు ఈ చిన్న సినిమాని బాగా ఆదరించారని అర్థం.

సంప్రదాయ విరుద్ధంగా ఒక్కోసారి వచ్చే మలుపు సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడానికి ‘118’ ఒక నిదర్శనం.

ఆ మలుపుతోటే '118' హిట్టయింది!

ఆ మలుపుతోటే ‘118’ హిట్టయింది! | actioncutok.com