45 years of Kode Nagu (1974)


45 years of Kode Nagu (1974)

45 సంవత్సరాల ‘కోడె నాగు’ (1974)

నాగరాజు అనే యువకుడి చుట్టూ, అతడి భావోద్వేగాల ఆధారంగా నడిచే కథ ‘కోడె నాగు’. కన్నడంలో విష్ణువర్థన్ నటించగా సూపర్ హిట్టయిన ‘నాగరహవు’ (1972)కు రీమేక్ ఈ సినిమా. ఆ సినిమా కూడా టి.ఆర్. సుబ్బారావ్ రాసిన మూడు నవలలు – ‘నాగరహవు’, ‘ఒండు గండు ఎరడు హెన్ను’, ‘సర్ప మత్సర’ – ఆధారంగా రూపొందింది.

మాతృకకు చిన్న చిన్న మార్పులు చేసి, మిగతా సినిమానంతా యథాతథంగా ‘కోడె నాగు’ రూపంలో తీశారు దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు (కె. రాఘవేంద్రరావు తండ్రి).

ఇందులో హీరో నాగరాజు (శోభన్‌బాబు) గురువుగా ఆత్రేయ నటించడం విశేషం. అలాగే తాళ్లూరి రామేశ్వరి ఈ సినిమాతోనే నటిగా పరిచయమైంది. అయితే నాయికగా కాదు. ఆమె ఇందులో ఒక విద్యార్థినిగా మనకు కనిపిస్తుంది.

‘నాగపాము పగ పన్నెండేళ్లు’, ‘సంగమం సంగమం అనురాగ సంగమం’, ‘అందాల గడసరివాడు’ వంటి పాపులర్ సాంగ్స్ ఈ సినిమాలోనివే. మల్లెమాల సుందరరామిరెడ్డి (ఎం.ఎస్. రెడ్డి) బేనర్ కౌముది పిక్చర్స్‌ను నిలబెట్టిన సినిమాగా ‘కోడె నాగు’ పేరు తెచ్చుకుంది.

శోభన్‌బాబు హీరోగా, చంద్రకళ, లక్ష్మి నాయికలుగా నటించిన ఈ చిత్రంలో జగ్గయ్య, రాజబాబు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, ముక్కామల, ధూళిపాళ, రామన్న పంతులు, శ్రీరంజని, నిర్మల ఇతర పాత్రల్ని పోషించారు.

అత్రేయ సంభాషణలతో పాటు మల్లెమాలతో కలిసి పాటలు రాశారు. పెండ్యాల నాగేశ్వరరావు అద్భుతమైన బాణీలు చేకూర్చారు. కె.ఎస్. ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా, మార్తాండ్ ఎడిటింగ్ సమకూర్చారు.

కథ

నాగరాజు (శోభన్‌బాబు) అతి ఆవేశపరుడు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా ఆకతాయిగా, రౌడీగా ముద్ర పడతాడు. ఆ కారణంగా తండ్రి సైతం అతడిని ద్వేషిస్తాడు. లోకంలో నాగరాజు ఎవరినైనా గౌరవిస్తాడంటే అది అతడికి పాఠాలు నేర్పిన బడిపంతులు (ఆత్రేయ)నే.

స్నేహితుడి చెల్లెలు అమృత (చంద్రకళ)ను ప్రేమిస్తాడు నాగరాజు. ఇద్దరూ గాఢమైన ప్రేమబంధంలో ఉండగా అమృతకు ఆమె కులంవాడితో పెళ్లి నిశ్చయిస్తారు పెద్దలు. ఆ పెళ్లిని తిరస్కరించడానికి ప్రయత్నిస్తుంది అమృత. స్వార్థమైన ప్రేమ కంటే త్యాగమే గొప్పదని గురువు చెప్పడంతో, తికమకకు గురైనా, అతడి మాటకు విలువిచ్చి, తన ప్రేమను త్యాగం చేస్తాడు నాగరాజు.

అమృతకు పెళ్లైపోతుంది. కొంత కాలం తర్వాత ఆమె ఒక వేశ్యగా నాగరాజుకు కనిపించడం ఒక విషాధం. భర్త ఆమెను ఒక వేశ్యావాటికకు అమ్మేశాడని తెలుస్తుంది.

తర్వాత జూలీ (లక్ష్మి) అనే క్రైస్తవ యువతి అతడి జీవితంలోకి వస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ మతాలు వేరు కావడం వల్ల సమాజం ఒప్పుకోదని స్పష్టమవడంతో లేచిపోదామనుకుంటారు. ఈసారీ మాస్టారు జోక్యం చేసుకుంటాడు. ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లే ముఖ్యమనీ, జూలీపై ప్రేమను చంపేసుకొమ్మని చెబుతాడు మాస్టారు.

 కానీ ఆయన మాటలు విని అమృతను వదులుకొని తప్పు చేశాననీ, తన వల్లే ఆమె వేశ్యగా మారిందనీ వాదిస్తాడు నాగరాజు. జూలీని పెళ్లిచేసుకోవాలంటే ముందు తన చావును చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తాడు మాస్టారు. ఆయనపై అమిత గౌరవం ఉన్న నాగరాజు ఏం చేశాడన్నది పతాక సన్నివేశం.

కోడె నాగు స్వతహాగా ప్రమాదకరమైందైనా, పూజలందుకుంటుంది. కానీ సమాజంలో దానికి స్థానం లేదని చెప్పడం ఈ కథ ఉద్దేశం.

45 years of Kode Nagu (1974)